NTV Telugu Site icon

Child Trafficking : చైల్డ్‌ ట్రాఫికింగ్ కేసులో సంచలన విషయాలు.. వాళ్లే టార్గెట్‌

Child Traficking

Child Traficking

Child Trafficking : చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా నుంచి రాచకొండ పోలీసులు 10 మంది చిన్నారులను రక్షించి, శిశు విహార్‌కు తరలించారు. ఈ ముఠా వివిధ ప్రాంతాల నుంచి చిన్నారులను అక్రమంగా తీసుకువచ్చి అమ్మకాలు జరిపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ముఠా ముఖ్యంగా మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ముంబై, ఉత్తరప్రదేశ్‌లోని మురికివాడలలోని నిరుపేద కుటుంబాల పిల్లలను లక్ష్యంగా చేసుకుంది. అనంతరం వీరిని తమిళనాడు, బెంగళూరు, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ వంటి ప్రాంతాల్లో పిల్లలేని తల్లిదండ్రులకు అమ్ముతున్నారు.

ఈ ముఠాలో ప్రధానంగా ఆసుపత్రుల్లో పనిచేసే వ్యక్తులే ఉన్నారని దర్యాప్తులో తేలింది. నిందితుల్లో గాంధీ హాస్పిటల్‌లో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్న కార్తిక్, అజంపుర UPHCలో ఆశా వర్కర్ అమూల్య, మలక్‌పేట్ ఏరియా హాస్పిటల్‌లో సూపర్వైజర్ ఇస్మాయిల్ ఉన్నారు. ఇప్పటివరకు 27 మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు, 14 మంది చిన్నారులను రక్షించారు. ముఠా ద్వారా ఇప్పటివరకు 25 మంది చిన్నారులను అక్రమంగా విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఇంకా 11 మంది చిన్నారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఈ ముఠా మగ శిశువులను రూ.4 లక్షలకు కొనుగోలు చేసి రూ.6 లక్షలకు అమ్ముతుండగా, ఆడ శిశువులను రూ.3 లక్షలకు కొనుగోలు చేసి రూ.4 లక్షలకు విక్రయించిందని పోలీసులు తెలిపారు. ఈ కేసును తీవ్రంగా పరిశీలిస్తున్న రాచకొండ పోలీసులు, ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) రంగంలోకి దిగడంతో నిందితుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పిల్లల అక్రమ విక్రయాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

Mrunal Thakur : ఛలో ముంబై అంటున్న మృణాల్