NTV Telugu Site icon

CP Sudheer Babu : పసిపిల్లలను అమ్ముతున్న ముఠా అరెస్ట్‌

Rachakonda Cp Sudheer Babu

Rachakonda Cp Sudheer Babu

CP Sudheer Babu : రాచకొండ పోలీసులు చిన్నపిల్లల విక్రయాలకు సంబంధించి భారీ అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 9 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌ బాబు తెలిపారు. అంతేకాకుండా, దత్తత తీసుకున్న 18 మంది పిల్లలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా పిల్లల అక్రమ విక్రయాల్లో కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల అనుసంధానంలో ముఠాలో ప్రధానంగా అమూల్య అనే మహిళ కీలకంగా వ్యవహరించినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ ముఠా 10 మంది చిన్నారులను అక్రమంగా విక్రయించింది. ఇంకా, అమూల్యతో పాటు దీప్తి అనే మహిళ కలిసి మరో 8 మందిని అమ్మినట్లు పోలీసులు గుర్తించారు.

మగ శిశువులను ₹4,00,000 – ₹6,00,000 మధ్య అమ్మకాలు జరిపారు. ఆడ శిశువులను ₹2,00,000 – ₹4,00,000 మధ్య విక్రయించారు. మగ శిశువులను ₹4,00,000 – ₹5,00,000 మధ్య కొనుగోలు చేసి ₹5,00,000 – ₹6,00,000 మధ్య అమ్మినట్లు తేలింది. ఇప్పటివరకు 25 మంది శిశువుల అమ్మకాలు జరిగాయి. ఇందులో 16 మందిని ఇప్పటికే రెస్క్యూ చేయగా, ఇంకా 9 మంది చిన్నారులను కాపాడాల్సి ఉంది.

ముఠాలో కీలక నిందితురాలిగా అమూల్య పేరు నిలిచింది. ఆమె అసలు ఆశా వర్కర్‌గా పనిచేస్తూ, ప్రస్తుతం ఆజంపురా యూపిహెచ్సీలో విధులు నిర్వహిస్తోంది. ఈ చిన్నారుల దత్తత లీగల్ ప్రాసెస్ ద్వారా జరగలేదు. చట్ట విరుద్ధంగా అక్రమ లావాదేవీల ద్వారా పిల్లలను విక్రయించారని పోలీసులు తెలిపారు.

జువెనైల్ జస్టిస్ యాక్ట్ (JJ Act) ప్రకారం, దత్తత ప్రక్రియ ఆన్లైన్లో నమోదు చేసి, ప్రభుత్వ అనుమతితో మాత్రమే జరగాలి. కానీ, ఈ ముఠా ఆ విధంగా కాకుండా అక్రమ మార్గాల్లో చిన్నారుల విక్రయాలను కొనసాగించింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి చిన్నారులను సేకరించారు. తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విక్రయించారు. ఈ కేసుపై పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చిన్నారుల అక్రమ విక్రయాలకు పాల్పడుతున్న నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Sudiksha Missing: సుదీక్ష తల్లిదండ్రుల నిర్ణయంతో అనుమానితుడికి విముక్తి