ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో దేశవ్యాప్తంగా SIR ను ప్రకటించారు. ఈ సమావేశంలో, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ.. 12 రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటరు జాబితాల రెండవ దశను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ దశలో ఓటరు జాబితాను అప్ డేట్ చేయడం, కొత్త ఓటర్లను యాడ్ చేయడం, లోపాలను సరిదిద్దడం ఉంటాయని తెలిపారు. SIR నవంబర్ 4న ప్రారంభం కానుంది. తుది ఓటర్ల జాబితా ఫిబ్రవరి 7, 2026న ప్రచురించనున్నారు. ఈ ప్రక్రియ అనేక దశల్లో పూర్తవుతుంది.
Also Read:Nagadurga : ధనుష్ మేనల్లుడి సినిమాలో హీరోయిన్గా ఫోక్ సెన్సేషన్
ఇప్పటివరకు, దేశం 1951, 2004 మధ్య ఎనిమిది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్స్ (SIRs) నిర్వహించింది. రాజకీయ పార్టీలు అనేక సందర్భాల్లో ఓటర్ల జాబితాల నాణ్యత సమస్యను లేవనెత్తాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. కాగా బీహార్‌లో ఓటర్ల జాబితాకు సంబంధించిన SIR ప్రక్రియ ఇప్పటికే పూర్తైన విషయం తెలిసిందే. దాదాపు 74.2 మిలియన్ల పేర్లతో కూడిన తుది జాబితా సెప్టెంబర్ 30న ప్రచురించారు. బీహార్‌లో పోలింగ్ నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో జరుగనుంది. ఫలితాలు నవంబర్ 14న ప్రకటించనున్నారు.
రేపటి నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రారంభమయ్యే 12 రాష్ట్రాలు
తొమ్మిది రాష్ట్రాలు:
ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గోవా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కేరళ మరియు రాజస్థాన్.
కేంద్రపాలిత ప్రాంతాలు:
అండమాన్ అండ్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరితో సహా మూడు కేంద్రపాలిత ప్రాంతాలు.
ఈ ప్రక్రియలో, బూత్ లెవల్ అధికారులు (BLOలు) ప్రతి ఓటరు ఇంటిని కనీసం మూడుసార్లు సందర్శించి కొత్త ఓటర్లను జాబితాలో చేర్చడానికి, ఏవైనా తప్పులను సరిదిద్దుతారని CEC జ్ఞానేష్ కుమార్ అన్నారు. జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ, BLOలు ఇంటింటికీ వెళ్లి ఫారం-6, డిక్లరేషన్ ఫారాలను సేకరించి, కొత్త ఓటర్లు ఫారాలను నింపడానికి, ERO (ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్) లేదా AERO (అసిస్టెంట్ ERO)కి అందజేస్తారు అని అన్నారు.
రెండవ దశ శిక్షణ మంగళవారం ప్రారంభమవుతుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు. అన్ని ప్రధాన ఎన్నికల అధికారులు (CEOలు), జిల్లా ఎన్నికల అధికారులు (DEOలు) రాబోయే రెండు రోజుల్లో రాజకీయ పార్టీలతో సమావేశమై SIR ప్రక్రియపై వారికి వివరించాలని ఆయన ఆదేశించారు. ఏ పోలింగ్ స్టేషన్‌లోనూ 1200 కంటే ఎక్కువ ఓటర్లు ఉండరని జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు.