NTV Telugu Site icon

MP Ranjith Reddy: 30 రోజులు నా కోసం కష్టపడితే.. ఐదేండ్లు మీ కోసం నేను కష్టపడతా..

Ranjith Reddy

Ranjith Reddy

ఇవాళ (శనివారం) తాండూరు పట్టణ సమీపంలో ఉన్న జీపీఆర్ గార్డెన్లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వేం నరేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్​ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు రాం మోహన్ రెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కాల్వ సుజాత, తాండూరు ఇన్చార్జి సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఇక, చేవెళ్ల లోక్ సభ అభ్యర్థి రంజిత్ రెడ్డిని రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో గెలుపు ఖాయమని తెలంగాణ ముఖ్యమంత్రి సలహదారులు, చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జి వేం నరేందర్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతి కాంగ్రెస్​ కార్యకర్త ఆయన గెలుపు కోసం పని చేయాలని సూచించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటేనన్నారు. బీజేపీ పార్టీ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది.. ప్రతి వ్యక్తి అకౌంట్లో రూ. 15 లక్షల రూపాయలు వేస్తారని హామీ ఇచ్చి మోసం చేసిందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఏ హక్కుతో తెలంగాణలో ఓట్లు అడుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ ఖతమైపోయింది.. మునుముందు బీజేపీ పార్టీ కూడా కనపడదని వ్యాఖ్యానించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తోందని విమర్శించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ తమ ప్రయోజనాల కోసం అలజడి సృష్టించడమే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వేం నరేందర్ రెడ్డి తెలిపారు.

Read Also: Ram Charan: మా అమ్మ‌ న‌మ్మ‌లేదు.. నాకు ద‌క్కిన ఈ గౌర‌వం వారందరిదీ!

తన కోసం ఈ 30 రోజులు కష్టపడితే.. రానున్న ఐదేండ్లు ప్రతి కాంగ్రెస్​ కార్యకర్త, సామాన్య ప్రజల కోసం పని చేస్తానని చేవెళ్ళ కాంగ్రెస్​ అభ్యర్థి డాక్టర్​ జి. రంజిత్​ రెడ్డి పేర్కొన్నారు. ఇక అయోధ్య రాముడు అందరివాడని.. కానీ బీజేపీ నేతలు అయోధ్య రామ మందిరం మేమే నిర్మించామని దేవుడు పేరు చెప్పి ఓట్లు అడగడం ఏంటని ఆయన ప్రశ్నించారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ చందాల సహకారంతో అయోధ్యలో రామ మందిరం నిర్మించుకున్నాం.. కానీ బీజేపీ నేతలు తామే నిర్మించమని చెప్పుకొని.. రాముడ్ని అడ్డం పెట్టుకొని.. ఓట్లు అడగడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. బీజేపీ పార్టీ మతాల మధ్య చిచ్చు పెడుతుంది.. తాను సర్వ మతాలను గౌరవిస్తానని అన్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో లేరని రంజిత్ రెడ్డి ఆరోపించారు. ప్రజా సమస్యల గురించి కొండా విశ్వేశ్వర్ ఇంటికి వెళితే అపాయింట్మెంట్ తీసుకొని రావాలని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. కరోనా సమయంలో ఏ ఒక్కరికి చిన్న సహాయం చేయలేరని ఆరోపించారు. ప్రజలకు అందుబాటులో ఉండే నేను కావాలా.. అందుబాటులో లేని కొండ విశ్వేశ్వర్ రెడ్డి కావాలో మీరే నిర్ణయించుకోండి అని చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి తెలిపారు.

Read Also: Balakrishna: టీడీపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యం..

ఇక, పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమని ఇంటికి సిమెంట్ లేకుండా ఎలా కట్టలేమో.. పార్టీకి కూడా కార్యకర్తలు లేనిది పార్టీ పటిష్టంగా ఉండదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు ఏ విధంగా పనిచేశారో.. ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని గెలిపించేందుకు అదే విధంగా పనిచేయాలన్నారు. బూత్ కమిటీ సభ్యులందరూ కలిసి కట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, తాండూర్​ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు పాత నాయకులతో కలిసి ఐక్యంగా ముందుకు వెళ్లాలన్నారు. ప్రతి ఒక్క ఓటరు ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను, మ్యానిఫెస్టోను వివరించి కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ స్వప్న, కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఆయా మండలాల ప్రజా ప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.