Cheating Trade: విజయవాడలో ట్రేడింగ్ పేరుతో బోర్డు తిప్పేసిన అద్వికా ట్రేడింగ్ కంపెనీ బాధితులు రోజురోజుకి పెరుగుతున్నారు. ఇప్పటి వరకు 100 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా 25 కోట్ల వరకు మోసపోయినట్టు ఫిర్యాదులు అందాయి. ఇంకా బాధితులు పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. సంస్థ అధినేత ఆదిత్యను పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు.
స్టాక్ ఎక్చేంజీల్లో ట్రేడింగ్ పేరిట బెజవాడ వేదికగా అద్విక ట్రేడింగ్ సంస్థ చేసిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గత ఐదేళ్లుగా సంస్థ అధినేత తాడేపల్లి ఆదిత్య పెద్ద ఎత్తున ప్రజల నుంచి కోట్లాది రూపాయలను షేర్ మార్కెట్లో పెట్టుబడులను పెడతానని వసూలు చేసినట్టు పోలీసులు విచారణలో గుర్తించారు. విజయవాడ, హైదరాబాద్, గుంటూరు, దుబాయ్ ప్రాంతాల్లో సంస్థ కార్యాలయాలు ఉన్నట్టుగా గుర్తించారు. ఒక్కొక్కరికి 6 రూపాయల చొప్పున వడ్డీ ఇస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసినట్లుగా గుర్తించారు. బాధితులు వందల సంఖ్యలో ఉండటంతో కోట్ల రూపాయలు ఇక్కడ చెల్లించినట్టుగా ప్రాధమికంగా నిర్ధారించారు. ఇప్పటికే సంస్థ కార్యాలయాన్ని సీజ్ చేశారు. ఆదిత్యను అదుపులోకి తీసుకొని ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అన్ని వివరాలను సేకరిస్తున్నారు కార్యాలయంలో ఉన్న కంప్యూటర్లను ఆదిత్య వినియోగించిన లాప్‌టాప్ ను ఇతర ఫోన్లను డేటా రికవరీ కోసం స్వాధీనం చేసుకున్నారు.
Read Also:Suryapet Horror: ఎటుపోతున్నాయి మానవ సంబంధాలు.. కన్న తండ్రినే దారికాచీ మరీ హత్య చేసిన కొడుకు..!
ఆదిత్య చాలా కాలం పాటు పెట్టుబడి పెట్టిన వారికి వడ్డీలు చెల్లించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి పూర్తిస్థాయిలో చెల్లింపులు నిలిచిపోయినట్టుగా గుర్తించారు పోలీసులు. డబ్బు చెల్లింపులు ఆగిపోయిన తర్వాత నుంచే పెట్టుబడి పెట్టిన వారి దగ్గర నుంచి ఆదిత్యపై ఒత్తిడి పెరిగినట్టు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల్లో కూడా ఆదిత్య ఏజెంట్లను నియమించుకొని వారి ద్వారా ప్రజల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశాడని చెబుతున్నారు. సంస్థకు డైరెక్టర్లుగా ఉన్న వారందరినీ ఇప్పటికే పోలీసులు గుర్తించి కీలక వివరాలను సేకరించారు. ఏజెంట్లను సుమారు 30 మందిని విచారించగా భారీ కమిషన్లను ఆశ చూపించి తమ ద్వారా డబ్బు వసూలు చేసినట్టు వారు చెబుతున్నారు.
జనం నుంచి వసూలు చేసిన డబ్బును దుబాయ్‌లో భారీగా పెట్టుబడులుగా ఆదిత్య మళ్లించినట్టుగా ప్రాధమికంగా గుర్తించినట్టు సమాచారం. దుబాయ్‌లో ఉన్న కార్యాలయంలో కూడా కార్యకలాపాలు నిర్వహించినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆదిత్య విదేశీ టూర్లపై కూడా పోలీసులు విచారణ చేపట్టారు. అద్విక ట్రేడింగ్ సంస్థకు సలహాదారుగా ఉన్న కీర్తి అనే యువతికి పెద్ద ఎత్తున జీతం ఇచ్చినట్టుగా సంస్థలో వాటా కూడా ఇచ్చినట్టుగా పోలీసులు చెబుతున్నారు. సింగపూర్ లో ట్రేడింగ్ అనుభవం ఉండటంతో ఇంత పెద్ద ఎత్తున ప్యాకేజీ ఇచ్చి షేర్ ఇచ్చి కీర్తిని విధుల్లో ఆదిత్య తీసుకున్నట్టుగా గుర్తించారు.
Read Also:Son Kills Father: మనిషి కాదు.. నరరూప రాక్షసుడు! కన్నతండ్రినే కిరాతకంగా..!
ప్రజల నుంచి వసూలు చేసిన కోట్లాది రూపాయలను ఆదిత్య 3 సంస్థలకు మళ్లించినట్టు తెలుస్తోంది. అద్విక ట్రేడింగ్ సంస్థతోపాటు మోహిత్ ట్రేడింగ్ సంస్థ, గోల్డెన్ లీప్ అనే సంస్థలోనూ పెట్టుబడులు పెట్టాడు ఆదిత్య. అలాగే కొంత డబ్బును దుబాయికి మళ్లించినట్టు సమాచారం. ఐతే అది హవాలా మార్గంలోనా లేదా ఇతరత్రా ఏ మార్గంలో పంపాడనేది తేలాల్సి ఉంది. ఈ ట్రేడింగ్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వారిలో పోలీసు శాఖకు సంబంధించిన వారు న్యాయశాఖకు సంబంధించిన వారు.. రాజకీయ నాయకులకు సంబంధించిన వారు కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో వారు తమ డబ్బు వెనక్కు తీసుకునేందుకు పోలీసులపై ఒత్తిడి తీసువస్తున్నట్టుగా తెలుస్తోంది.
సంస్థ కార్యాలయానికి ఆదిత్యతో పాటు డైరెక్టర్లను కూడా తీసుకువెళ్లిన పోలీసులు అక్కడ ఉన్న డేటా మొత్తాన్ని క్రోడీకరించి.. ఎంత మొత్తం వసూలు చేశారు? ఎంత చెల్లింపులు చేశారు? ఎంత మళ్లించారు? అనే అంశాలకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించారు. ఆదిత్యకు సంబంధించిన బ్యాంకు ఎకౌంట్ల ద్వారా లావాదేవీలను ఎవరితో జరిపారని విషయాలను గుర్తిస్తున్నారు. పూర్తిస్థాయిలో విచారణ పూర్తి చేసి మరిన్ని కేసులు నమోదయ్య అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. గోల్డెన్ లీప్ యాప్‌ను కేవలం ప్రజల నుంచి డబ్బు వసూలు చేసి అందులో ఉన్నట్టుగా చూపేందుకు మాత్రమే ఆదిత్య తయారు చేయించుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. 2024లోనే సుమారు 150 కోట్ల వరకు పెట్టుబడులు వచ్చినట్టుగా చెబుతున్నారు పోలీసులు.