Son Kills Father: మనిషి కాదు వాడు… నరరూప రాక్షసుడు! కన్నతండ్రినే కిరాతకంగా హతమార్చాడు ఓ కిరాతక కొడుకు. సర్‌ప్రైజ్ చేస్తాను నాన్న అని.. కళ్లకు గంతలు కట్టి.. ఏకంగా కత్తితో పొడిచి చంపేశాడు. ఇంటి అవసరాల కోసం పొలం తాకట్టు పెట్టి తండ్రి తెచ్చిన డబ్బులను ఆన్‌లైన్ బెట్టింగ్ లో తగలబెట్టిందే కాకుండా.. డబ్బులేవి అని అడిగిన పాపానికి తండ్రిని హత్యచేశాడు ఈ పుత్రరత్నం. గచ్చిబౌలి పీఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది.
వృత్తిపరంగా పని ఒత్తిడి ఎంత ఉన్నా… తన రెక్కల కష్టంతో ఇంటి సంసారాన్ని లాక్కొస్తుంటాడు. అప్పు.. సొప్పు చేసి… తల తాకట్టు పెట్టి ఐనా సరే ఇంట్లో వాళ్లకు కావాల్సిన డబ్బులు సమకూరుస్తుంటాడు. గచ్చిబౌలిలో కూడా ఇలాంటి తండ్రే తన పొలం తాకట్టుపెట్టి డబ్బులు సమకూర్చాడు. కానీ, పుత్రరత్నం ఆ డబ్బులును బెట్టింగ్‌లో తగలబెట్టాడు. అది గమనించిన తండ్రి డబ్బులేవని అడగగా.. సర్‌ప్రైజ్ అంటూ తండ్రిని హతమార్చాడు.
Read Also:Crime: వితంతు, భర్తలకు దూరంగా ఉండే మహిళలే టార్గెట్.. కానిస్టేబుల్‌గా నటిస్తూ లైంగిక దోపిడి..
వనపర్తి జిల్లా ఘన్‌పూర్ మండలం కోతులకుంటకు చెందిన కెతావత్ హన్మంతు… బతుకుదెరువు కోసం హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాడు. గోపన్‌పల్లి పరిధిలోని NTR నగర్‌కు వలస వచ్చి మేస్త్రీగా పనిచేస్తున్నాడు. హన్మంత్‌కు భార్య జములమ్మ, కొడుకులు రవీందర్, సంతోష్ ఉన్నారు. అవసరాల నిమిత్తం హన్మంతు ఇటీవల తన భూమిని కుదువబెట్టి 6 లక్షల అప్పు తీసుకున్నాడు. ఈ డబ్బులను ఇంట్లోని బీరువాలో ఉంచాడు. ఇంట్లో పెద్ద ఎత్తున డబ్బులు ఉండటాన్ని గమనించాడు ఇంటర్ పూర్తి చేసిన పెద్ద కొడుకు కెతావత్ రవీందర్. ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడి అప్పుల పాలైన రవీందర్ కన్ను ఈ డబ్బులపై పడింది. ఎవరికీ తెలియకుండా ఇంట్లో ఉన్న ఆరు లక్షల నుంచి రెండున్నర లక్షలు దొంగిలించాడు. ఈ డబ్బులను కూడా ఆన్‌లైన్ బెట్టింగ్‌లో పెట్టి.. పోగొట్టుకున్నాడు. డబ్బులు తక్కువగా ఉండటాన్ని గమనించిన తండ్రి హన్మంతు… ఇంట్లో వాళ్లను నిలదీశాడు. డబ్బులు దొంగిలించింది కొడుకు రవీందర్ అని తేలింది. డబ్బులేవని అడిగాడు. స్నేహితుడికి అప్పుగా ఇచ్చాను.. కొన్ని రోజుల్లో తిరిగి ఇస్తాడని చెప్పాడు. ఎన్ని సార్లు అడిగినా… ఎన్ని రోజులుగా అడుగుతున్నా ఇదే మాట చెబుతున్నాడు రవీందర్.
డబ్బుల విషయమై.. ప్రతీ రోజు ఇంట్లో గొడవ జరుగుతోంది. దీంతో కొడుకు రవీందర్‌కి ఓ కిరాతక ఆలోచన వచ్చింది. ఎలాగైనా తండ్రి అడ్డు తొలగించుకుంటే… పీడా పోతుంది అనుకున్నాడు. పక్కా స్కెచ్ వేశాడు. తన స్నేహితుడు అప్పుగా తీసుకున్న రెండున్నర లక్షల రూపాయల డబ్బులు ఇచ్చేందుకు వస్తున్నాడని ఈనెల 1న తండ్రిని ఎన్‌టీఆర్ నగర్‌లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. నీకు మంచి సర్‌ప్రైజ్ ఇస్తానని నమ్మించి తండ్రి కళ్లకు గంతలు కట్టాడు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉంచిన కత్తితో తండ్రి గొంతులో బలంగా పొడిచాడు రవీందర్. దాదాపు 100 మీటర్ల వరకు పరిగెత్తి కింద పడిపోయాడు హన్మంతు. తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు.
Read Also:Off The Record: వనపర్తి డీసీసీ పీఠం కోసం ఆరుగురు పోటీదారులు
తండ్రి హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించాలనుకున్నాడు రవీందర్. వెంటనే తన బాబాయ్ రమేశ్‌కు ఫోన్ చేసి నాన్న కత్తితో పొడుచుకొని చనిపోయాడని చెప్పాడు. నిజమేనని నమ్మిన కుటుంబసభ్యులు.. మృతదేహాన్ని సొంతూరైన కోతులకుంటకు తరలించారు. అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. కానీ, ఎలాంటి ఇబ్బందులు లేని హన్మంతు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు…? అంత అవసరం ఏం వచ్చిందని అనుమానించారు బంధువులు. ఇంట్లో డబ్బుల విషయమై గొడవ జరగడం.. కొడుకు రవీందర్ తీరు అనుమానాస్పదంగా ఉండటంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు బంధువులు.
విషయం తెలుసుకున్న గచ్చిబౌలి పోలీసులు ఘనపూర్ పీఎస్‌కు సమాచారం ఇచ్చారు. అంత్యక్రియలు నిర్వహిస్తే అందరిపై కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. దీంతో హన్మంతు మృతదేహాన్ని తిరిగి గచ్చిబౌలి తీసుకొచ్చారు. మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. కొడుకు రవీందర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. తనకేం తెలియదని బుకాయించే ప్రయత్నం చేశాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా… అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తండ్రిని తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు రవీందర్. దీంతో రవీందర్ పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు గచ్చిబౌలి పోలీసులు.