NTV Telugu Site icon

Nitya Pellikoduku : మేడ్చల్‌ జిల్లాలో నిత్య పెళ్లికొడుకు.. అరెస్ట్‌ చేసి అత్తారింటికి..!

Marriage Dates

Marriage Dates

Nitya Pellikoduku : మాయ మాటలు చెప్పి యువతులను వల్లో వేసుకుని ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఓ కేటుగాడి బాగోతం తాజాగా బయటపడింది. ఈ వ్యక్తి బండారం రెండో భార్య లీలావతి గుర్తించడంతో జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు.

కేసు వివరాలు:
మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్‌నగర్ గబ్బిబాల్‌పేట్ ప్రాంతానికి చెందిన లక్ష్మణరావు (34) ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 2014లో బంధువుల అమ్మాయి అనూషతో అతనికి వివాహమైంది. అయితే కొంతకాలానికే అనూషతో మనస్పర్థలు ఏర్పడి ఆమెతో దూరంగా ఉంటున్నాడు.

రెండో పెళ్లి:
ఈ సమయంలో బాలాజీనగర్‌కు చెందిన లీలావతి (25)తో పరిచయం ఏర్పడింది. ఆమెను ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పి 2021లో మెదక్ చర్చిలో వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కానీ కొంతకాలానికే లీలావతితో కూడా విభేదాలు తలెత్తడంతో ఆమెను కూడా వదిలేసి తప్పించుకుని తిరగసాగాడు.

మూడో పెళ్లి:
2022లో శబరి అనే మరొక యువతితో పరిచయం పెంచుకున్న లక్ష్మణరావు, ఆమెను కూడా మాయమాటలు చెప్పి వివాహం చేసుకున్నాడు. మల్కాజిగిరి ప్రాంతంలో ఆమెతో కలిసి ఉంటున్నాడు.

రెండో భార్య లీలావతి కుటుంబ సభ్యులు లక్ష్మణరావు గురించి ఆరా తీసి మల్కాజిగిరి వద్ద అతని అడ్రెస్ తెలుసుకున్నారు. అక్కడకు చేరుకోగా అతను శబరితో జీవిస్తున్న విషయం బయటపడింది. ఇలా ఒకరికి తెలియకుండా మరొకరిని మోసం చేస్తూ మొత్తం ముగ్గురిని వివాహం చేసుకున్న విషయం వెలుగుచూసింది.

లీలావతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జవహర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. విచారణ అనంతరం అతడిని రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన జవహర్‌నగర్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకే వ్యక్తి ముగ్గురితో వివాహం చేసి వారి జీవితాలను మోసం చేయడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది.

Sharad Pawar: ఇండియా కూటమిపై శరద్‌ పవార్ సంచలన వ్యాఖ్యలు

Show comments