ఇండియా కూటమిపై సీనియర్ రాజకీయ వేత్త, ఎన్‌సీపీ(ఎస్‌పీ) అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి కేవలం జాతీయ ఎన్నికల కోసమే ఉందని.. రాష్ట్ర, స్థానిక ఎన్నికల కోసం కాదని.. దీనిపై ఎప్పుడూ చర్చ జరగలేదన్నారు. ఇటీవల శివసేన (యూబీటీ) కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో జరిగే స్థానిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు వెల్లడించింది. తాజాగా శరద్ పవార్ వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చాయి. స్థానిక ఎన్నికలపై ఎప్పుడూ చర్చ జరగలేదని.. మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలా? వద్దా? అనేది 8-10 రోజుల్లో సమావేశమై నిర్ణయం తీసుకుంటామన్నారు. తాజాగా శరద్ పవార్ వ్యాఖ్యలతో ఇండియా కూటమి పనైపోయిందని అర్థమవుతోంది. ప్రస్తుతం దాని ఉనికి ప్రశ్నాతార్థకమేనని స్పష్టం అవుతోంది.
ఇది కూడా చదవండి: ICC: రెండోసారి ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు గెలిచిన స్టార్ బౌలర్..
ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆప్, కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. ఈ రెండు కూడా ఇండియా కూటమిలో భాగంగా ఉన్నాయి. కానీ హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి రెండు పార్టీల మధ్య చీలికలు ఏర్పడ్డాయి. విడివిడిగా పోటీ చేసి పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎవరికి వారే సింగిల్‌గా బరిలోకి దిగాయి. అంతేకాకుండా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. దీంతో ఇండియా కూటమి ప్రస్తుతం మనుగడలో లేదని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Stock Market: సంక్రాంతి జోష్.. లాభాలతో ముగిసిన సూచీలు.. అదానీ షేర్లు పరుగులు
ఇటీవల ఇండియా కూటమిలోని పార్టీల నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. ఇండియా కూటమి కేవలం లోక్‌సభ ఎన్నికల కోసమేనని స్పష్టం చేశారు. అలాగే జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా అదే రీతిగా వ్యాఖ్యలు చేశారు. అలాగే శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఇండియా కూటమి కేవలం లోక్‌సభ ఎన్నికల కోసమే ఉందని.. ఓడిపోగానే ఒక్క రివ్యూ కూడా జరగలేదని తెలిపారు.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. విమర్శలు-ప్రతివిమర్శలతో మాటల యుద్ధం నడుస్తోంది. హస్తిన ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ఇక్కడ ఆప్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.
ఇది కూడా చదవండి: Trimukha: సన్నీ లియోన్ తో కొత్త హీరో ‘త్రిముఖ’!