AP Caste Survey: ఏపీలో కులగణన ప్రక్రియ షెడ్యూలులో మార్పులు చేర్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జనవరి 19 తేదీ నుంచి 28 తేదీలోగా కులగణన ప్రక్రియ పూర్తి చేయాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. గ్రామవార్డు సచివాలయ సిబ్బంది, ఎన్యుమరేటర్లు వారం రోజుల్లో ఇంటింటికీ వెళ్లి కులగణన ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. మొత్తం 10 రోజుల్లో ఈ కులగణన ప్రక్రియ పూర్తి అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Read Also: TTD: ఎట్టకేలకు టీటీడీ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్ర ఆర్కియాలజీ శాఖ
ఇంటింటి కులగణన ప్రక్రియలో అందుబాటులో లేని వ్యక్తులకు సచివాలయాల్లో నమోదుకు అవకాశం కల్పిస్తామని పేర్కొంది. సచివాలయాల్లో నమోదు చేసుకునేందుకు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 2 తేదీ వరకూ 5 రోజుల పాటు వెసులుబాటు కల్పించింది. ఫిబ్రవరి 15 తేదీనాటికి గ్రామవార్డు సచివాలయాల శాఖ వద్ద కులగణనకు సంబంధించిన తుది నివేదిక సిద్ధం కావాలని సర్కారు ఆదేశించింది. కులగణన కోసం సచివాలయ సిబ్బందికి ఇచ్చే శిక్షణను జనవరి 11 తేదీ లోగా ముగించాలని ఆదేశించింది. ఎన్యూమరేటర్లు, సచివాలయ సిబ్బంది, సూపర్ వైజర్ల మ్యాపింగ్ 12 తేదీలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కులగణనలో భాగంగా సామాజిక ఆర్ధిక, విద్యా, ఉపాధి అంశాలపై వివరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
