Site icon NTV Telugu

CM Chandrababu: 2029 లోపు ప్రతి ఒకరికి ఇల్లు ఇచ్చే బాధ్యత నాది!

Cm Chandrababu

Cm Chandrababu

తిరుపతి జిల్లా నాయుడుపేటలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన టిడ్కో గృహ సముదాయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడతలో భాగంగా 2,50,893 మంది పేదలకు గృహప్రవేశం కల్పించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఈ క్రమంలో నాయుడుపేటలో టిడ్కో లబ్ధిదారులతో కలిసి సీఎం సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వేలాది కుటుంబాలు తమ సొంత ఇళ్లలోకి అడుగుపెట్టాయి.

ప్రభుత్వం నిర్మించిన ఈ టిడ్కో గృహ సముదాయాలు ప్రైవేట్ అపార్ట్‌మెంట్లకు ధీటుగా నిర్మించబడ్డాయి. పార్కులు, వాకింగ్ ట్రాక్‌లు, ఇతర మౌలిక సదుపాయాలతో ఈ గృహాలు ఆధునిక సౌకర్యాలతో రూపొందించబడ్డాయి. జీ+3 విధానంలో నిర్మించిన ఈ ఇళ్లలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. కేవలం 21 నెలల్లో రెండు విడతల్లో మొత్తం 5.5 లక్షల ఇళ్లను పేదలకు అందించామని ప్రభుత్వం వెల్లడించింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో గృహరహితుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. ఈ టిడ్కో గృహాలు పేదల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతాయని అభిప్రాయపడ్డారు.

Also Read: IPL 2026-MS Dhoni: ఎంఎస్ ధోనీ ఫాన్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2026 మొత్తానికి దూరం, బిగ్ ట్విస్ట్ కూడా!

సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… ‘మంచి ముహూర్తంలో లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందించాను. ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలనేది మా సంకల్పం. 2029 లోపు ఇల్లు లేని ప్రతి ఒకరికి ఇల్లు ఇచ్చే బాధ్యత నాది. 8 లక్షల పైచిలుకు ఇళ్లను 2014లో పూర్తి చేసి ఇచ్చాం. తిరుపతి జిల్లాలో 15,600 ఇల్లు నిర్మించి ఇచ్చాం. వ్యవస్తను అస్తవ్యస్తం చేశారు, దాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. టిడ్కో గృహాల సముదాయంలో అన్ని వసతులు కల్పిస్తున్నాం. మంచి ఇల్లు కడితే వాటిని నాశనం చేశారు. పెదోళ్ళ పొట్ట కొట్టారు. బాధ్యత లేకుండా ప్రవర్తించారు. వైసీపీ గత ఐదేళ్లలో కట్టింది కేవలం 6 లక్షల 55 వేల ఇళ్లు మాత్రమే. నేను ప్రారంభించిన ప్రతి ఒక్కటిని వారు కూల్చేశారు. ప్రజావేదికతో విద్వంసం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులను సొంత వాటికి డైవర్ట్ చేసుకున్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. స్మశానంలో.. కొండల్లో ఇల్లు కట్టించాలని వైసీపీ చూసింది’ అని అన్నారు.

‘పేద వాడికి కేంద్రం ఇచ్చిన డబ్బులను కూడా డైవర్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఫైన్ వేసినా.. సిగ్గు రాలేదు. విశాఖలో ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తి.. పేదవాడికి ఇళ్లు కట్టించడానికి మీనమేషాలు లెక్కించారు. ముఖ్యమంత్రి పదవి నాకు కొత్త కాదు.. కానీ పనికిమాలిన వైసీపీ ప్రభుత్వాన్ని గతంలో నేను ఎప్పుడు చూడలేదు. 2029 లోపు 17 లక్షల 60 వేలు ఇల్లు కడతాం. ఈ ఏడాది 5 లక్షల మందిని పారిశ్రామిక వేత్తలుగా తయారుచేస్తాం. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజరేషన్లు కల్పిస్తాం. పురుషులతో సమానంగా అవకాశాలు ఇస్తాం. చురుగ్గా ఉండే మహిళలు రాజకీయాల్లోకి రావాలి. మత్స్యకారులకు ఎవ్వరికీ అన్యాయం జరగదు.. అందరికీ స్తానిక పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పిస్తాం. పోలవరాన్ని కూడా నాశనం చేశారు.. గోదావరి పుష్కరాలు కంటే ముందే పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తాం. రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడారు. హైద్రాబాద్, చెన్నై కంటే మెరుగ్గా అమరావతిని అభివృద్ధి చేస్తాం. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు నెలకు 20 వేలు అందిస్తున్నా. తమిళనాడు, పాండిచ్చేరి నుంచి మత్స్యకారులు వచ్చి ఇక్కడ చేపలు పట్టుకుంటున్నారు.. గతంలో గస్తీ కోసం 20 బోట్లు ఇప్పించా. ఇప్పుడు 12 బోట్లు కావాలని అడిగారు, వాటిని కూడా ఇస్తాం. ఈ ప్రాంతంలోని చేపలు.. ఇక్కడి మత్స్యకారులే పట్టుకునేలా చర్యలు తీసుకున్నాం. స్థానిక మత్స్యకారులకే మా సహకారం ఉంటుంది’ అని సీఎం చెప్పుకొచ్చారు.

Exit mobile version