Site icon NTV Telugu

Chandrababu: ఢిల్లీలో చంద్రబాబు.. అర్ధరాత్రి అమిత్‌షాతో భేటీ

Babu

Babu

Chandrababu: ఢిల్లీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షాతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.. నిన్న సాయంత్రం 6.30 గంటలకు హస్తిన చేరుకున్న చంద్రబాబుకు ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికారు ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్‌, గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌ నాయుడు, రఘురామకృష్ణరాజు.. ఇక, ఆ తర్వాత హోటల్‌కు చేరుకుని కాసేపు విశ్రాంతి తీసుకున్న ఆయన.. ఆ తర్వాత ఎంపీ గల్లా జయదేవ్‌ ఇంటికి చేరుకున్నారు. అక్కడే పార్టీ ఎంపీలతో సమావేశం అయ్యారు.. ఈ సమయంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా అక్కడి రావడం చర్చగా మారింది.. ఇటీవలే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. టీడీపీలో చేరతారనే ప్రచారం సాగుతోన్న నేపథ్యంలో.. ఆయన చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Read Also: Handbag: ఈ బుల్లి హ్యాండ్ బ్యాగ్ ధర ఎన్ని లక్షలో తెలిస్తే అవాక్కవుతారు..

ఇక, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు చంద్రబాబు.. మొదట రాత్రి 7 గంటల తర్వాతే ఈ భేటీ జరుగుతుందనే ప్రచారం జరిగినా.. చివరకు బుధవారం రాత్రి 11.25 గంటల సమయంలో అమిత్‌షా నివాసానికి చేరుకున్నారు చంద్రబాబు.. సుమారు గంటపాటు చర్చలు సాగాయి.. అయితే, ఈ సమావేశం నుంచి 10 నిముషాల ముందుగానే వెళ్లిపోయారు జేపీ నడ్డా… ముఖ్యంగా ఈ భేటీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై చర్చ సాగినట్టుగా తెలుస్తోంది.. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేన ఇప్పటికే టీడీపీతో పొత్తు ప్రకటించి ఎన్నికల సిద్ధమైన వేళ.. ఇప్పుడు టీడీపీని కూడా ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించడానికి బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబుతో సమావేశమైనట్లు భావిస్తున్నారు. ఇక, త్వరలోనే ఎన్నికల పొత్తులపై ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు.. ఈ రోజు ఉదయమే ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చంద్రబాబు ప్రయాణం కానుండగా.. మరోవైపు.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈ రోజు హస్తినకు వెళ్లనున్నారు.

Exit mobile version