Vijaysai Reddy: 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఆయన చేసిన ప్రతీ పని ఓ స్కామే.. చంద్రబాబు ఓ స్కిల్డ్ క్రిమినల్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్, ఎంపీ విజయసాయి రెడ్డి.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. గత మూడు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అందరూ గమనిస్తున్నారు.. నిన్న టీడీపీ బంద్ లో చంద్రబాబు సొంత కంపెనీ హెరిటేజ్ కూడా స్పందించి మూయలేదన్నారు.. చంద్రబాబు ఆయన మహానాయకుడు అని నమ్మించే ప్రయత్నం చేసే మీడియా కూడా జీర్ణించుకోలేక పోతున్నారన్న ఆయన.. విద్యార్థి దశ నుంచే నేర పూరిత ఆలోచనలు చేసే చంద్రబాబు.. ఆయన సొంత మీడియా ఆయన విజనరీ ఉన్న నేత అని చేసిన ప్రచారం డొల్ల అని తేలిపోయిందన్నారు. సీమెన్స్ కంపెనీ పెట్టుబడుల్లో లోకేష్ ముఖ్య అనుచరుడు కిలారి రాజేష్ ది ప్రముఖ పాత్ర అని ఆరోపించారు సాయి రెడ్డి.
రాష్ట్రంలో రాజకీయాలు భ్రష్టు పట్టించిన నేత చంద్రబాబు అని విమర్శించారు సాయిరెడ్డి.. ఆయన ఓటుకు నోటు రాజకీయాలు అందరికీ తెలుసని.. స్వతాహాగా కరిష్మా లేని నేత చంద్రబాబు.. కనీస నాయకత్వ లక్షణాలు లేవు.. ఆయన చేయని ఆరాచకాలు లేవు.. హైదరాబాద్ అభివృద్ధి పేరుతో ఆయన ఇన్ సైడ్ ట్రేడింగ్ అందరికీ తెలుసు.. జ్యుడీషియల్ వ్యవస్థలో కూడా తన సొంత సామాజిక వర్గ నేతలతో స్టేలు తెప్పించుకునే నేత చంద్రబాబు అంటూ ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు అరెస్ట్ లోకేష్, కొన్ని మీడియా సంస్థలకు మింగుడు పడని అంశంగా పేర్కొన్నారు. లోకేష్ కు ధైర్యం ఉంటే చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో స్టే వెకేట్ చేయించాలని సవాల్ చేవారు. 370 కోట్ల ప్రజా ధనాన్ని దోచుకున్నారు.. డబ్బులో ఒక్క రూపాయి కూడా రాలేదని సిమెన్స్ సంస్థ స్పష్టం చేసిందని.. కుంభకోణం చేసింది మొత్తం చంద్రబాబని ఈడీ కూడా బయట పెట్టింది.. ప్రతీ పనిలో ప్రజా ధనం దుర్వినియోగం చేసిన నేత చంద్రబాబు అని దుయ్యబట్టారు.
చంద్రబాబు అరెస్టుపై మాట్లాడేందుకు టీడీపీ వాళ్లే ముందుకు రాలేదని విమర్శించారు సాయిరెడ్డి.. అందుకే బాబు రెప్రజెంటేటివ్స్ ఇతర రాష్ట్రాల ముఖ్య నేతలతో ట్వీట్స్ పెట్టిస్తున్నారు.. చంద్రబాబు పరామర్శకు రావాలని స్పెషల్ ఫ్లైట్స్ పెడుతున్నారని ఆరోపించారు. ఇక, ఆరేళ్లలో అధికారంలోకి వాళ్ళు వచ్చే అవకాశం లేదు.. వాళ్ళు అధికారం లోకి వచ్చినా న్యాయంగా పనులు చేసిన మమ్మల్ని ఏం చేస్తారు..? అని ప్రశ్నించారు. ఇక, బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి టీడీపీ కోవర్ట్ అని మేం భావిస్తున్నాం అంటూ సంచలన ఆరోపణల చేశారు. జనసేన, టీడీపీ రెండు త్వరలో కలుస్తాయని అందరూ మాట్లాడుకునే మాట అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి.
మరోవైపు ప్రకాశం జిల్లాలో అన్నీ నియోజకవర్గాల్లో పార్టీ సమస్యలు గుర్తించి సరిదిద్దుతాం.. జిల్లాలో సమస్యలు పరిష్కరించే భాధ్యత బాలినేని శ్రీనివాసరెడ్డి చూసుకుంటారని తెలిపారు విజయసాయిరెడ్డి.. జిల్లాలో బాలినేని తిరుగులేని నేత.. బాలినేని ఆవేదన మాట వాస్తవం.. పార్టీలో బిన్నభిప్రాయాలు సరిచేస్తాం.. ఎవరో ఒక అధికారి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అరెస్టు జరిగింది అనటం అవాస్తవం అన్నారు. ఆధారాలు దొరికితే నారా లోకేష్ పై కూడా చర్యలు ఉంటాయని హెచ్చరించారు విజయసాయిరెడ్డి.