Chandrababu Health Bulletin: రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై రెండవ రోజు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. చంద్రబాబు హెల్త్ బులెటిన్‌నుసెంట్రల్ జైల్ ఇంఛార్జి సూపరిండెంట్ రాజ్‌కుమార్ విడుదల చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు ఆరోగ్య పరిస్థితులపై సోషల్ మీడియాలో, పలు ప్రచార మాధ్యమాల్లో పుకార్లు విస్తరిస్తున్నందున జైలు అధికారులు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. చంద్రబాబు భద్రత కోసం జైలులో పటిష్టమైన భద్రతా చర్యలను చేపడుతున్నామన్నారు. చంద్రబాబు భద్రత కోసం అను నిత్యం ఒక హెడ్ వార్డర్, ఆరుగురు గార్డింగ్ సిబ్బందిని నియమిందామని అధికారులు వెల్లడించారు. ఆయనను ఉంచిన బ్యారక్ నందు మరి ఏ ఇతర గార్డింగ్ సిబ్బందికి గానీ, ఖైదీలకు గాని ప్రవేశము లేదన్నారు. ఒక జైలరు స్థాయి అధికారి అను నిత్యమూ చంద్రబాబును పర్యవేక్షిస్తూ ఉంటారని ప్రకటనలో తెలిపారు. చంద్రబాబుకు భోజన సదుపాయము అందించడం, ఇతర వసతులు సమకూర్చడాన్ని ఈ అధికారి స్వయంగా పర్యవేక్షిస్తారన్నారు. సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ కూడా జైలులోని చంద్రబాబు భద్రతపై ఆరా తీస్తూ, సూచనలు ఇస్తున్నట్లు చెప్పారు. జైలులో ముగ్గురు వైద్యాధికారులు ఉన్నారని జైలు అధికారులు వెల్లడించారు. చంద్రబాబుకు రోజుకు మూడు సార్లు వైద్య పరీక్షలు చేస్తున్నారని.. ఆయన ఆరోగ్య వివరాలను రిజిస్టర్ చేస్తున్నామన్నారు.
Also Read: Devineni Avinash: మాటిస్తే మాట నిలబెట్టుకునే తత్త్వం సీఎం జగన్‌ది..
చంద్రబాబు చర్మ సంబంధిత అస్వస్థతపై సెంట్రల్ జైలు అధికారులు గురువారం ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. జైలు వైద్యాధికారులకు చంద్రబాబు తన చర్మ సమస్యలను తెలియజేయగా.. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి నుంచి వైద్యులను పిలిపించారు. ప్రభుత్వాసుపత్రి నుంచి వచ్చిన ఇద్దరు వైద్యులు చంద్రబాబును పరీక్షించారు. చర్మ సంబంధిత సమస్య ఉందని ఆయన చెప్పడంతో చర్మ వైద్యుల్ని పిలిపించామని, డాక్టర్లు పరీక్షలు చేసి మందులను సూచించారని, ఆ మందులను చంద్రబాబుకు అందిస్తామని డిప్యూటీ జైలు సూపరింటెండెంట్ రాజ్ కుమార్ వెల్లడించారు. ఇదిలా ఉండగా.. చంద్రబాబు ఇటీవల రాజమండ్రి సెంట్రల్ జైలులో అస్వస్థతకు లోనైన విషయం తెలిసిందే. గత వారం రోజులుగా ఎండ తీవ్రత భారీగా ఉండటంతో బాబు ఒక్కసారిగా డీ హైడ్రేషన్‌కు గురయ్యారు. ఈ విషయంపై జైల్లో ఉన్న వైద్యాధికారికి చంద్రబాబు ఫిర్యాదు చేశారు. అనంతరం బాబుకు పరీక్షలు చేసి ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు.
చంద్రబాబు హెల్త్ బులిటెన్
*బీపీ- 130/80
*ఉష్ణోగ్రత – సాధారణం
*పల్స్-84/మినిట్
*ఫిజికల్ యాక్టివిటీ..గుడ్
*హార్ట్-S1 S2
*లంగ్స్ – క్లియర్
*SPO2…97శాతం