విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార వైసీపీ పార్టీపై తీవ్ర విమర్శలు కురిపించారు. శృంగవరపుకోట యుద్ధానికి సై అంటుంది.. కాలు దువ్వుతుంది. దీనికి కారణం.. బాధ, ఆవేదన అని వ్యాఖ్యలు చేశారు. ఒకటే నినాదం.. వైసీపీ ఓడిపోవాలని తెలిపారు. ఎన్నో తుఫాన్లు చూశా.. మే 13న ఒకటే తుఫాన్ అని అన్నారు. వైసీపీ బంగాళాఖాతంలో కలిసిపోవాలని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వంలో ఎవరికైనా రక్షణ ఉందా.. మహిళలకు అస్సలు రక్షణ లేదని చంద్రబాబు పేర్కొన్నారు.
గుంటూరుకు చెందిన ఒక మహిళ వైసీపీ ప్రభుత్వం పై పోరాడిందని అన్నారు. ఈరోజు ఢిల్లీకి వెళ్లి.. ఎంతో మంది ప్రముఖులను కలవడానికి ప్రయత్నం చేసింది.. కానీ అనుమతి లేకపోవడంతో ఆమె బొటన వేలు కట్ చేసుకుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ అరాచక పాలన పోవాలని ఆమె ఈ సాహసం చేసిందని తెలిపారు. కర్నూల్ లో అబ్దుల్ అనే వ్యక్తి వైసీపీ ప్రభుత్వం పెట్టే బాధలు తట్టుకోలేక రైలు కింద పడి చనిపోయారన్నారు.
ఒక అరాచక శక్తి, ఒక దుర్మార్గుడు ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నాడని మండిపడ్డారు. జగన్ ఒక అహంకారి.. ఎవరైనా అన్యాయం జరిగింది అంటే వారిని బాధపెట్టడం, చివరికి హత్య చేయడం చేస్తున్నారని తెలిపారు.
విశాఖలో ఒక మంచి యూనివర్సిటీ అయినా గీతంలో కూడా ఇబ్బందులు గురి చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఈ రాష్ట్రంలో చట్టం లేదు…న్యాయం లేదని పేర్కొన్నారు. జగన్ ఒక సైకో…అతను ఒక అహంకారి దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వంలో రాష్ట్రం అంతా గంజాయి, డ్రగ్స్, చీప్ లిక్కర్ మయం అయిపోయిందని తెలిపారు. ఒక వ్యక్తి స్వార్థం కోసం…రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. హుద్ హద్ వస్తే ఇక్కడే ఉండి…అన్ని పనులను దగ్గర ఉండి చూసుకున్నానని తెలిపారు.