Site icon NTV Telugu

Andhra Pradesh Politics: ఏపీ రాజకీయాల్లో వదిన వర్సెస్ మరిది.. పొలిటికల్‌ వార్‌ తప్పదా..?

Chandrababu

Chandrababu

Andhra Pradesh Politics: ఏపీ రాజకీయాల్లో కొత్త కాంబినేషన్లు మొదలయ్యాయి. ఇప్పటి వరకు పార్టీల్లో లేని బంధుత్వాలు.. తెరపైకి వచ్చాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి.. వరుసకు వదిన, మరిది అవుతారు. వీరిద్దరూ చెరొక పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. పురంధేశ్వరి ఇప్పటి వరకు చంద్రబాబును డైరెక్ట్‌గా విమర్శించిన దాఖలాలు లేవు. కాంగ్రెస్‌లో ఉన్నా, బీజేపీలో ఉన్నా.. టీడీపీ అధినేతపై విమర్శలు చేయలేదు. ఎన్నడూ చంద్రబాబు పేరు కూడా ఎత్తలేదు. ఇప్పడు పరిస్థితి వేరు. అధ్యక్ష హోదాలో ఆమె విమర్శించాల్సి వస్తుంది. రెండు పార్టీల మధ్య పొత్తులు లేవు. అవగాహన లేదు. వదిన, మరిది ఖచ్చితంగా విమర్శలు అయితే చేసుకోవాల్సిందే. ఇప్పుడిదే ఇదే ఆసక్తికరంగా మారింది.

తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి చంద్రబాబుకు, పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు పొసిగేది కాదు. మధ్యలో కొంత రాజీపడినా.. తర్వాత మళ్లీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు బయటకు వచ్చారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మధ్య మధ్యలో.. కుటుంబ కార్యక్రమాల్లో మాత్రమే కలుసుకోవడం తప్పించి.. రెండు కుటుంబాల మధ్య ప్రత్యక్షంగా సంబంధాలేమీ లేవు. తాజాగా భిన్న ధృవాలైన రాజకీయ పార్టీలకు నాయకత్వం వహిస్తున్నందున.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్ని రోజుల నుంచి చంద్రబాబు బీజేపీ అనుకూల వైఖరితో ఉన్నారు. ఆయన రాష్ట్ర, జాతీయ నాయకత్వాలపై విమర్శలు చేయడం లేదు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌.. ఈ రెండు పార్టీలతో 2014 కాంబినేషన్‌ను పునరావృతం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అది ఎంతమేరకు సఫలీకృతం అవుతుందో చూడాలి.

ఒకవేళ పొత్తు కుదిరితే.. చంద్రబాబు, పురంధేశ్వరి చేతులు కలపక తప్పదు. అదే జరిగితే.. ప్రస్తుత అధికార పార్టీ నేతలు చంద్రబాబుతో పాటు పురంధేశ్వరిని టార్గెట్ చేసే అవకాశం లేకపోలేదు. అది జరగ్గకపోతే.. ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులుగా విమర్శలకు పదును పెట్టాల్సి ఉంటుంది. ఇవి ఏ స్థాయిలో ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. చంద్రబాబుపై పురంధేశ్వరి విమర్శలు చేయకపోతే.. టీడీపీ, బీజేపీ మధ్య ఏదో ఉందని ప్రతిపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు.. బలమైన పార్టీల అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించలేదు. తొలిసారి ఇలాంటి పరిస్థితులు ఎదురవడంతో.. భవిష్యత్‌ రాజకీయాలు ఎలా ఉంటాయన్నది ఉత్కంఠగా మారింది.

Exit mobile version