ICC To Give Extra Money To PCB For Champions Trophy 2025: వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసిందే. 8 దేశాలు పాల్గొనే ఈ మెగా టోర్నీ 2025 ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగనుంది. టోర్నీ ప్రతిపాదిత షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అందించింది. అయితే ఈ టోర్నీలో ఆడుతుందా? లేదా? అనే దానిపై ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును పాకిస్థాన్‌కు పంపాలని బీసీసీఐని ఒప్పించే బాధ్యతను ఐసీసీకి పీసీబీ అప్పగించిందట. భారత జట్టును పాకిస్థాన్‌లో ఆడించాలని విశ్వప్రయత్నాలు చేస్తోందట.
భద్రతా, రవాణాపరమైన కారణాల దృష్ట్యా లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో భారత్ తన మ్యాచ్‌లు ఆడేలా పీసీబీ షెడ్యూల్ రూపొందించింది. అయినా కూడా పాకిస్థాన్‌కు వెళ్లేందుకు బీసీసీఐ సుముఖంగా లేదు. భారత్ ఆడే మ్యాచ్‌లను ఆసియా కప్ మాదిరి వేరే దేశంలో నిర్వహించాలని బీసీసీఐ కోరుతున్నట్లు తెలుస్తోంది. దుబాయ్ లేదా శ్రీలంకల్లో భారత్ మ్యాచ్‌లను నిర్వహించాలని ఐసీసీని బీసీసీఐ వర్గాలు అడిగాయట. బీసీసీఐ విన్నపంపై ఐసీసీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. బీసీసీఐ కాదు.. భారత ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తేనే టీమిండియా పాకిస్థాన్‌కు వెళుతుందన్న విషయం తెలిసిందే.
Also Read: Gold Price Today: బడ్జెట్ ఎఫెక్ట్.. ఒక్కరోజులోనే రూ.2750 తగ్గిన బంగారం! భారీగా పడిపోయిన వెండి
తాజాగా కొలంబోలో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సంబంధించిన బడ్జెట్, షెడ్యూల్‌ను ఐసీసీకి సమర్పించినట్లు పీసీబీ వర్గాలు తెలిపాయి. ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను ఫైనలైజ్ చేయడం ఇప్పుడు ఐసీసీ చేతిలోనే ఉంది. ఒకవేళ టోర్నీని హైబ్రిడ్ విధానంలో వేరే దేశంలో నిర్వహించాల్సి వస్తే.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఐసీసీ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టిందని తెలుస్తోంది. భారత జట్టు మ్యాచ్‌లు వేరే దేశంలో నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడితే.. అందుకు అవసరమైన నిధులను పీసీబీకి కేటాయించేందుకు సిద్ధంగా ఉందట.