Cheetah Deaths: దేశంలోని చీతాల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని పేర్కొంది. చీతాల సంరక్షణలో ఎటువంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో చీతాల మృతిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. చీతాల సంరక్షణలో ఎటువంటి లోపాలు లేవని స్పష్టం చేసింది. మార్చి 27 నుంచి ఇప్పటి వరకూ కునో నేషనల్ పార్కులో ఆరు చీతాలు మృతిచెందాయి. వాటిలో మూడు ఇక్కడే పుట్టిన కూనలు ఉన్న విషయం తెలిసిందే. కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. చీతాల ప్రాజెక్ట్ కింద చిరుతల సంరక్షణ, నిర్వహణలో పాలుపంచుకునే అధికారులు, ఉద్యోగులను ఎంపిక చేసి దక్షిణాఫ్రికా, నమీబియాలకు స్టడీ టూర్ కోసం పంపుతామని చెప్పారు. రక్షణ, సంరక్షణ, ప్రచారం, ప్రతిపాదిత చిరుత రక్షణ దళం కోసం ఆర్థిక వనరులతో సహా సాధ్యమైన అన్ని సహకారాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.
భోపాల్‌లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి డాక్టర్ విజయ్ షా, రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులతో చిరుత ప్రాజెక్టు గురించి కేంద్ర మంత్రి యాదవ్ చర్చించారు. అటు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ (IIFM)లో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) 23వ సమావేశానికి కూడా ఆయన అధ్యక్షత వహించారు. చీతాల మృతిపై ఎటువంటి అలసత్వం లేదని.. మూడు చిరుత పిల్లల మరణాల విషయంలో కూడా ప్రపంచ వన్యప్రాణుల సాహిత్యం చిరుతల్లో 90% శిశు మరణాలను స్పష్టంగా పేర్కొందని ఒక అధికారి తెలిపారు.ఆఫ్రికన్ దేశాల నుంచి కునో నేషనల్ పార్కులోకి తీసుకొచ్చిన చిరుతలతో ఎలాంటి ట్రయల్స్ చేయలేదన్నారు. చిరుతలు కలిసి నివసిస్తాయి కాబట్టి మగ, ఆడ చిరుత సంభోగంలో కూడా ఎటువంటి ప్రయోగాలు జరగలేదని చెప్పారు. ఇది డాక్యుమెంట్ చేసిన సాక్ష్యమని.. ఆఫ్రికన్ నిపుణుల నుంచి క్లియరెన్స్ ఆధారంగా జరిగిందని కేంద్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్స్ సీపీ గోయల్ పేర్కొన్నారు. సంభోగం సమయంలో రెండు మగ చిరుతలతో జరిగిన ఘర్షణలో ఆడ చీతా చనిపోయిన విషయం తెలిసిందే.
తమది పులుల రాష్ట్రమని, ఈ అంశం ఎంతో ప్రతిష్టాత్మకమని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ తెలిపారు. ప్రాజెక్ట్ చీతాను విజయవంతం చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. చిరుత పిల్లల పుట్టుక, మనుగడ రేటు గురించి సమాచారం ప్రారంభంలోనే ఇవ్వబడిందని.. చిరుత ప్రాజెక్టుకు సంబంధించిన సిబ్బంది అంతా అంకితభావంతో పనిచేస్తున్నారని చెబుతూ.. ఈ ప్రాజెక్టు పురోగతి సంతృప్తికరంగా ఉందన్నారు. చిరుతలకు ప్రత్యామ్నాయ ఆవాసాల కోసం గాంధీ సాగర్ అభయారణ్యంలో అవసరమైన ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అటవీ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు.