ఈ సీజన్ లో అధికంగా సాగు అవుతున్న పంటలలో క్యారెట్ కూడా ఒకటి.. శరీరానికి కావలసిన అన్నీ పోషకాలు మెండుగా ఉంటాయి.. ఆరోగ్యానికి మేలుచేసే ఎన్నో గుణాలు కలిగి వుండటంతో మార్కెట్ మంచి డిమాండ్ ఉంది.. దుంప కూరగాయలను సాగు చేసే రైతులు ఎక్కువగా క్యారెట్ ను సాగు చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. ప్రస్తుతం ఈపంట సాగుకు అనుకూలమైన సమయం. మరి రకాల ఎంపికతో పాటు అధిక దిగుబడుల కోసం సాగు పాటించాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు వ్యవసాయ నిపుణులు..
చల్లని వాతావరణంలో బాగా దిగుబడిని ఇచ్చే దుంప జాతి ఇది.. ఉష్ణోగ్రత 18-24 డిగ్రీల సెల్సియస్ మధ్య వున్నప్పుడు కారట్ పంటనుంచి అధిక దిగుబడి వస్తుంది. అంటే మన ప్రాంతంలో శీతాకాలం ఈ పంటసాగుకు అత్యంత అనుకూలం. నవంబరు వరకు ఈ పంటను విత్తుకోవచ్చు. మార్కెట్ లో ఒడిదుడుకులుగా ఉన్న ధరను ధృష్టిలో ఉంచుకొని , ఒకే సారి కాకుండా 15 రోజుల వ్యవధిలో దఫ దఫాలుగా విత్తుకుంటే మంచి దిగుబడిని పొందవచ్చు..
పంట వేసే ముందు పొలాన్ని బాగా దుక్కు దున్నాలి.. ఆఖరిదుక్కిలో పశువుల ఎరువుతోపాటు సగభాగం నత్రజని, పూర్తి భాస్వరం, పొటాష్‌లను వేసుకోవాలి. మిగిలిన సగభాగం నత్రజనిని విత్తిన 6వారాలకు పైపాటుగా లేదా డ్రిప్ వసతి వున్న రైతులు ఫెర్టిగేషన్ పద్ధతిలో అందించాలి. వాతావరణ పరిస్థితులకు తగ్గట్లుగా, నేల స్వభావాన్ని బట్టి నీటితడులను అందించాలి.. ఈ పంటలో తెగుళ్ల బెడదా కూడా ఎక్కువగానే ఉంటుంది.ఆకుమచ్చ, ఆకుమాడు తెగులు, బూడిద తెగుళ్లు నష్టం ఎక్కువగా కన్పిస్తాయి. వీటితోపాటు ఆకుతినే పురుగులు, రసం పీల్చు పురుగుల బెడద ఎక్కువగా వుంటుంది. వీటి నివారణకు ఎప్పటికప్పుడు పొలాన్ని గమనిస్తూ, సకాలంలో సస్యరక్షణా చర్యలను పాటించాలి.. నాటిన 90 రోజుల్లో పంట చేతికి వస్తుంది.. దుంపలను బాగా శుభ్రం చేసి మార్కెట్ చేస్తే మంచి లాభాలను పొందవచ్చు..