Car Racing: హైదరాబాద్ నగరంలో మరోసారి కార్ రేసర్లు రెచ్చిపోయారు. శంషాబాద్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున కొంతమంది యువకులు కార్లతో రేసింగ్‌లు, స్టంట్‌లు చేయడం ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ యువకులు ఓఆర్‌ఆర్‌పై వేగంగా కార్లు నడిపించి, ఆపై ఒక్కసారిగా వాటిని ఆపి గింగిరాలు తిప్పారు. ఇలా ఉన్నచోటే కార్లను పలుమార్లు రౌండ్‌గా తిప్పుతూ హంగామా సృష్టించారు. ఈ కార్ రేసింగ్ కారణంగా ఓఆర్‌ఆర్‌పై ప్రయాణిస్తున్న ఇతర వాహనదారులకు పెద్ద ఇబ్బందులు ఎదురయ్యాయి. వీరి స్టంట్‌లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అవడంతో, ఆ ఫుటేజీ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
Read Also: Organ Donation: అవయవదానంతో మరికొందరికి ప్రాణదానం చేసిన డాక్టర్
శంషాబాద్ ఆర్‌జీఐఏ సీఐ బాలరాజు ఈ వీడియో ఆధారంగా ఈ రేసింగ్‌కు పాల్పడిన యువకులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. అయితే, ఓఆర్‌ఆర్‌పై పెట్రోలింగ్ తగ్గిపోవడంతో ఇలాంటి రేసింగ్‌లు తిరిగి మొదలైనట్లు ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ సంఘటన ఆందోళన కలిగించడంతో అధికారులు స్పందించి, రౌడీ ఆటగాళ్లను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.