క్యాప్సికంను ఈమధ్య ఎక్కువగా పండిస్తున్నారు.. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉండటంతో మార్కెట్ లో వీటికి ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది..క్యాప్సికం ధర మార్కెట్‌లో ఇతర కూరగాయల కంటే మెరుగ్గా ఉంది. దీంతో రైతులు బాగా సంపాదించవచ్చు. రైతులు ఆర్థికంగా లాభాలను అందుకోవాలంటే కాలానికి, మార్కెట్ కు తగ్గట్టుగా వ్యవసాయాన్ని చేయాల్సి ఉంటుంది. కాప్సికం సాగుతో మంచి ఆదాయం వస్తుంది అంటున్నారు వ్యవసాయ నిపుణులు..
ఈ క్యాప్సికం ను సిమ్లా మిర్చి, బెల్‌పెప్పర్, కూరమిరప, బెంగుళూరుమిర్చి అని కూడా పిలుస్తారు. వీటిలో విటమిన్ ఎ,సి అధికంగా ఉంటుంది. ఇవి ఆకుపచ్చ, ఎరుపు, నారింజ, పసుపు రంగులో ఉంటాయి. పాలీహౌస్‌లో పండించడం వల్ల పంటకు కావాల్సిన టెంపరేచర్ మాత్రమే అందుతుంది కనుక కాయలు ఒకే సైజులోనూ ఒకే కలర్‌లోనూ ఉంటాయి… ఇలా పండిస్తే ఆరునెలల వరకు పంట దిగుబడి ఉంటుంది..చీడపీడల బెడద తక్కువగా ఉంటుంది..
సాదారణంగా క్యాప్సికమ్ మొక్కలు నాటిన 75 రోజుల తర్వాత దిగుబడిని ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఒక హెక్టారులో దాదాపు 300 క్వింటాళ్ల క్యాప్సికం ఉత్పత్తి అవుతుంది. వెంటిలేటెడ్ హౌస్‌లో క్యాప్సికమ్ పండించిన సంవత్సరములో 10 నెలలు దిగుబడి పొందుటకు అవకాశం ఉంది.. బరువైన సారవంతమైన నేలలు ఈ పంటసాగుకు అనుకూలమైనది.. మొక్కలు నాటిన 10-15 రోజులలో ఏపుగా పెరగని మొక్కలను గుర్తించి తీసివేసి వాటి స్థానంలో బాగా పెరిగే మొక్కలను నాటుకుంటే దిగుబడి బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది.. మొక్కలు నాటిన తర్వాత తెగుళ్లను వెంటనే గుర్తించాలి..
ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే.. క్యాప్సికం సాగుని బిందు పద్ధతిలో సేద్యం చేయడం మేలైన ఫలితాలను ఇస్తుంది. వ్యవసాయానికి ఇది ఉత్తమమైన నీటిపారుదల పద్ధతి. బిందు పద్ధతిలో సేద్యం నీటిని ఆదా చేయడంతోపాటు అవసరాన్ని బట్టి నీటిని వాడుకోవచ్చు. ఖర్చు ఆదా అవుతుంది. అలాగే ఉత్పత్తి బాగుంటుంది. ఎరువులను కూడా సరైన పద్దతిలో వాడుకోవచ్చు.. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడిని పొందుతారు..