Neeraj Chopra: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా చారిత్రాత్మక విజయం సాధించినందుకు భారతీయులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఓ భారతీయుడు బంగారు పతకం సాధించడం ఇదే తొలిసారి. ఒక బిలియన్ మందికి పైగా ప్రజల హృదయాలను మళ్లీ గెలుచుకున్న అథ్లెట్, భారత జెండాపై సంతకం చేయడానికి నిరాకరించి అతని దేశభక్తిని బయటపెట్టడంతో నీరజ్‌పై అభినందనల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బుడాపెస్ట్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల జావెలిన్ త్రోలో బంగారు పతకాన్ని గెలుచుకున్న తర్వాత, ఒక హంగేరియన్ అభిమాని నీరజ్ వద్దకు వచ్చి భారత జెండాపై సంతకం చేయమని అడిగింది. అయితే, “ఆ జెండాపై నేను సంతకం చేయలేను, అది నా జాతీయ జెండా” అని చోప్రా నిరాకరించాడు. చివరికి ఆమె చొక్కా స్లీవ్‌పై సంతకం చేశాడు. ఆ సమయంలో ఆమె కూడా సంతోషంగా ఫీల్ అయిందని జర్నలిస్ట్ జోనాథన్ సెల్వరాజ్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
Read Also: Karun Nair: అప్పుడలా.. ఇప్పుడిలా.. మళ్లీ తనను తలుచుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్
నీరజ్ చోప్రా త్రివర్ణ పతాకంతో ఉన్న అభిమాని టీ-షర్ట్‌పై సంతకం చేసిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జెండాపై సంతకం చేయడానికి నిరాకరించినందుకు చాలా మంది నెటిజన్లు చోప్రాను అభినందించారు. ‘ఇదే కదా అసలైన దేశభక్తి’, ‘నిజంగా ఇది మనందరికీ స్పూర్తి’, ‘నీకు దేశం పట్ల గౌరవానికి శభాష్’.. అంటూ నెటిజన్లు నీరజ్ దేశభక్తిని కొనియాడుతున్నారు. 25 ఏళ్ల అథ్లెట్ విజయం భారత్‌కు పెద్ద విజయంగా పరిగణించబడుతుంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఏదైనా ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడుగా నీరజ్ నిలిచాడు.నీరజ్ చోప్రా ఇప్పుడు ఒలింపిక్ గోల్డ్ మెడల్, డైమండ్ ట్రోఫీ, వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ గోల్డ్ మెడల్‌తో సహా గ్లోబల్ మెడల్స్‌ను సాధించి భారత్‌ను గర్వించేలా చేశాడు.