ED Raids:విదేశీ నిధుల చట్టాలను ఉల్లంఘించారనే ఆరోపణలపై బెంగళూరుకు చెందిన ఎడ్-టెక్ సంస్థ బైజూస్ ఎండీ, సీఈవో బైజు రవీంద్రన్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈరోజు సోదాలు నిర్వహించింది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనల ప్రకారం రవీంద్రన్, అతని కంపెనీ ‘థింక్ & లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్’పై కేసుకు సంబంధించి దర్యాప్తు సంస్థ బెంగళూరులోని రెండు వ్యాపార కార్యాలయాలు, ఒక నివాస స్థలంలో సోదాలు చేసింది. ఈ సోదాల్లో పలు నేరారోపణ పత్రాలు, డేటా స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది.
Read Also: Delivery Boy : ప్యాక్ చిరగలేదు.. బరువు తగ్గలేదు.. కానీ 10ఐఫోన్లు మాయం
ఈడీ సోదాల అనంతరం వెంటనే బైజూస్ సంస్థ స్పందించింది. ఈ సోదాలు ఫిమా కింద సాధారణ విచారణకు సంబంధించినవేనని పేర్కొంది. “మేము అధికారులతో పూర్తిగా పారదర్శకంగా ఉన్నాము. వారు కోరిన మొత్తం సమాచారాన్ని వారికి అందించాము. మా కార్యకలాపాల సమగ్రతపై మాకు అత్యంత విశ్వాసం తప్ప మరేమీ లేదు. మేము అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూ, నైతికతను సమర్థించటానికి కట్టుబడి ఉన్నాము.” అని బైజూస్ వెల్లడించింది. “2011 నుండి 2023 మధ్య కాలంలో కంపెనీ రూ. 28,000 కోట్ల (సుమారు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పొందినట్లు ఫెమా శోధనలు వెల్లడించాయి” అని ఈడీ ఒక మీడియా ప్రకటనలో తెలిపింది. ఇదే కాలంలో విదేశీ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో వివిధ విదేశీ సంస్థలకు దాదాపు రూ.9,754 కోట్లను పంపినట్లు ఆ ప్రకటనలో తెలిపింది. ప్రైవేట్ వ్యక్తుల ద్వారా వచ్చిన వివిధ ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్య తీసుకోబడింది.