Business Headlines 10-03-23:
వి-హబ్ ‘సార్తిక’ లాంఛ్
తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని వి-హబ్.. అంటే.. విమెన్స్ హబ్.. సార్తిక అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం అమలుచేస్తున్న వివిధ పథకాలపై వారికి అవగాహన కల్పించటమే ఈ ప్రోగ్రామ్ లక్ష్యం. కేంద్రం ప్రవేశపెట్టిన.. ప్రధానమంత్రి ఉపాధి అవకాశాల కల్పన పథకం, ముడిపదార్థాల సరఫరా పథకం, బార్‌కోడ్ రిజిస్ట్రేషన్ సబ్సిడీ పథకం వంటివాటిపై తొలుత మహిళా పారిశ్రామికవేత్తల్లో చైతన్యం కల్పించనున్నారు. ఈ మేరకు బ్రిటన్‌కి చెందిన ఆర్థిక సేవల సంస్థ టైడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
ఇన్సూరెన్స్ ఇంకా భారం
హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రీమియం పెంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. పోయినేడాది 30 శాతం వరకు పెంచిన సంస్థలు ఇప్పుడు 20 శాతం పెంచాలని చూస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు 15 నుంచి 20 శాతం భారం మోపాయి. మరిన్ని సంస్థలు ఇదే బాటలో నడిచే సూచనలు కనిపిస్తున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. కరోనా కారణంగా క్లెయిమ్‌ల సంఖ్య పెరగటంతో ఆరోగ్య బీమా సంస్థల లాభాలు భారీగా తగ్గాయి. ఆ లోటును భర్తీ చేసుకోవటానికి ప్రీమియం పెంచకతప్పట్లేదని చెబుతున్నాయి.
20 లక్షలిస్తామన్న సెబీ
డిఫాల్టర్ల ఆచూకీ చెప్పినవారికి 20 లక్షల రూపాయల వరకు నజరానా ఇస్తామని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా.. సెబీ ప్రకటించింది. ఇది ఈ నెల 8 నుంచే అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు 515 మంది ఎగవేతదార్ల లిస్టును విడుదల చేసింది. ఈ జాబితాలో ఉన్నవారి గురించి మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. సమాచారం అందించే వ్యక్తుల వివరాలను సీక్రెట్‌గా ఉంచుతారు. వాళ్లకు ఎంత నజరానా ఇవ్వాలో సిఫారసు చేసేందుకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
మళ్లీ వచ్చిన కాంపా కోలా
1970వ దశకం నాటి ఫేమస్ కూల్ డ్రింక్ కాంపా కోలా సరికొత్తగా మళ్లీ మార్కెట్‌లోకి వచ్చింది. రిలయెన్స్ రిటైల్ సంస్థ ఈ బ్రాండ్‌ని తిరిగి ప్రవేశపెట్టింది. ముఖేష్ అంబానీ కంపెనీ ఈ కాంపా కోలా హక్కులను ఇటీవలే దక్కించుకుంది. వేసవి కాలం మొదలు కావటం, కూల్ డ్రింక్స్ సేల్స్ ఊపందుకోవటంతో తొలుత తెలుగు రాష్ట్రాల్లో విక్రయాలను ప్రారంభిస్తోంది. ముందుగా.. మూడు.. కోలా, లెమన్, ఆరెంజ్ ఫ్లేవర్లలో అందుబాటులోకి తెస్తోంది. 200, 500, 600, 1000, 2000 మిల్లీ లీటర్ల ప్యాక్‌లలో లాంఛ్ చేసింది.
హైదరాబాద్‌లో ఫెడెక్స్
ట్రాన్స్‌పోర్ట్, ఇ-కామర్స్ తదితర సర్వీసులు అందించే ఫెడెక్స్ కార్పొరేషన్.. ఇండియాలో మొట్టమొదటి అడ్వాన్స్‌డ్ కేపబిలిటీ కమ్యూనిటీ సెంటర్‌ను ఏర్పాటుచేయనుంది. అది కూడా హైదరాబాద్‌లోనే అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది సెకండాఫ్‌లో ఇది ప్రారంభం కానుందని ఫెడెక్స్ పేర్కొంది. భారతదేశంలో టెక్నాలజీ వాడకం పెరగటం, డిజిటల్ ఎంటర్‌ప్రైజ్ ట్యాలెంట్ అధికంగా ఉండటం దీనికి కారణాలని తెలిపింది. అడ్వాన్స్‌డ్ కేపబిలిటీ కమ్యూనిటీ సెంటర్ వల్ల తొందరగా మరిన్ని ప్రాంతాలకు సేవలందించొచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది.
ఫోన్‌పేలో భారీ పెట్టుబడి
ఫ్లిప్‌కార్ట్ కో-ఫౌండర్ బిన్నీ బన్సల్.. ఫోన్‌పేలో 100 నుంచి 150 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ మేరకు చర్చలు కూడా జరుపుతున్నట్లు తెలుస్తోంది. చర్చలు సఫలమై ఆయన ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఈ సంస్థలో ఇది అత్యధిక వ్యక్తిగత పెట్టుబడి కానుంది. చర్చలు కొనసాగుతున్నాయని, అమౌంట్ ఎంతనేదే ఖరారు కావాల్సి ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ డీల్ త్వరలోనే క్లోజ్ అవుతుందని పేర్కొన్నారు. ఫోన్‌పేని ఫ్లిప్‌కార్ట్ 2016లో అక్వైర్ చేసుకుంది. ఇందులో బిన్నీ బన్సలే కీలక పాత్ర పోషించారు.