వరంగల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం పెంచికలపేట గ్రామంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సతీమణి జ్యోతి గడపగడపకు తిరిగి ఓట్లు అభ్యర్థించారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూడండి.. బీఆర్‌ఎస్‌ను గెలిపించి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి భార్య జ్యోతి మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు పరకాల నియోజకవర్గంలో రోడ్లు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయో గమనించాలన్నారు. పదేళ్లలో పరకాల రూపురేఖలు మార్చి గొప్పగా అభివృద్ధి చేశామన్నారు.
Read Also: Kidnaiping Case : లవర్తో లేచిపోయింది.. కిడ్నాప్ అయ్యానని అబద్ధం చెప్పింది.. తీరా చూస్తే
బీఆర్‌ఎస్ పాలనలో పెద్ద మొత్తంలో నిధులు తీసుకువచ్చి నియోజకవర్గంలోని అన్ని సమస్యలను పరిష్కరించే విధంగా అభివృద్ధి పనులను చేపట్టామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సతీమణి జ్యోతి తెలిపారు. గ్రామాలలో తిరుగుతూ తెలంగాణ ప్రభుత్వంపై విష ప్రచారాలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులను నిలదీయాలన్నారు. వారు పరిపాలిస్తున్న రాష్ట్రాలలో ఏఏ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో ప్రశ్నించాలని ఆమె పేర్కొన్నారు. బీజేపీ- కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి మోసపోయి గోస పడోద్దన్నారు. అంతకు ముందు గ్రామంలోని శివాలయంలో.. బొడ్రాయి దగ్గర చల్లా జ్యోతి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, గ్రామ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.