BRS Party: బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఇద్దరిపై పార్టీ అధిష్ఠానం వేటు వేసింది. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ప్రకటించింది.
Read Also: Ponguleti, Jupally Suspension Live: పార్టీ నుంచి పొంగులేటి, జూపల్లి సస్పెన్షన్
ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ క్రమంలో ఇరు నేతలు సీఎం కేసీఆర్‌పై విమర్శల వర్షం కురిపించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కేసీఆర్.. మరోసారి ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారని.. అది పగటి కలేనంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ఇక ఎందరో అమరుల ప్రాణ త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణను సీఎం కేసీఆర్ తాకట్టు పెట్టే పరిస్థితి తీసుకొచ్చారని జూపల్లి కృష్ణారావు విమర్శించారు. తెలంగాణలో పాలన ఎప్పుడో గాడి తప్పిందని, బీఆర్‌ఎస్ పేరుతో చెత్త పాలనను దేశానికి ఇవ్వాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఈ విమర్శల వ్యాఖ్యల నేపథ్యంలోనే పార్టీ ఈ నిర్ణయం తీసుకొని ఉంటుందని పలువురు నేతల అభిప్రాయ పడుతున్నారు.