Kadiyam Srihari: జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇచ్చే హామీలు అమలైనట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటానని ఆయన సవాల్ విసిరారు. కాంగ్రెస్ నాయకుల మాటలు తుపాకీ రామునికి ఎక్కువగా , ఉత్తర కుమారునికి తక్కువగా ఉన్నాయని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజల చేత ఛీ అనిపించుకున్న రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డిలు వారి నియోజకవర్గాల్లో దమ్ముంటే కేసీఆర్‌ను పోటీ చేయాలనడం హాస్యాస్పదమన్నారు.
ప్రజల చేత చీత్కరానికి గురైన వారు కేసీఆర్‌ను సవాల్ చేసే ధైర్యం, దమ్ము ఉందా అంటూ మండిపడ్డారు. వారికి కేఏ పాల్‌కు తేడా ఏముందన్నారు. కాంగ్రెస్ నాయకులకు పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. మతిభ్రమించి మాట్లాడుతున్న వారు కాంగ్రెస్ పార్టీకి మంచి చేస్తున్నారో కీడు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే రాష్ట్రం ఆగమవుతుందని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని కడియం శ్రీహరి పేర్కొన్నారు.