Ponnam Prabahakar: మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజి వద్ద కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హుస్నాబాద్‌ను కోనసీమ చేస్తానన్న కేసీఆర్ ఇప్పుడు ఎం చెప్తారని ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన వివరాలు ట్విట్టర్‌లో పెట్టాలన్నారు. ప్రతీ విషయంపై సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు ట్విట్టర్‌లో సమాధానం చెప్తారని.. మేడిగడ్డ ఘటనపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ప్రాజెక్టుకు ఏం జరిగిందో చెప్పడానికి ఎవరూ లేరన్నారు. డిజైన్ లోపమే బ్యారేజి కుంగడానికి కారణమని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ కట్టిన కట్టడాలు ఇప్పటికీ చెక్కు చెదరలేదని..ఉక్కు కట్టడాలుగా నిలిచాయన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో కట్టిన కట్టడాలు ఎందుకు నేలకూలుతున్నాయని ఆయన విమర్శించారు.
Also Read: Amitshah-Pawan Kalyan: అమిత్ షాతో పవన్ భేటీ.. జనసేనతో పొత్తు, సీట్ల సర్దుబాటుపై చర్చ
కాళేశ్వరం ప్రాజెక్టును ఎప్పటికప్పుడు ఎండగడుతున్నామని, కేంద్ర ప్రభుత్వం ఇంజనీర్లను పంపి విచారణ చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మౌనం వీడి ప్రజలకు కాళేశ్వరం వాస్తవాలను తెలియపరచాలని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇంజినీర్ అవతారం ఎత్తినట్లు చెప్పుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు నోరుమెదపడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో హుస్నాబాద్, గౌరవెల్లి ప్రాంతానికి కోనసీమగా చేస్తానని చెప్పి.. సీఎం కేసీఆర్ రైతులకు అన్యాయం చేశారని దుయ్యబట్టారు. మేడిగడ్డ బ్యారేజీని సందర్శించడానికి కాంగ్రెస్ శ్రేణులు, రైతులు తరలివెళ్లారు. మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు, రైతులను బొమ్మారం వద్ద పోలీసులు అడ్డుకోగా.. కాంగ్రెస్ శ్రేణులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌తో పాటు మరో నలుగురు కాంగ్రెస్ నాయకులకు మాత్రమే మేడిగడ్డ సందర్శనకు అనుమతి ఇచ్చారు. నిర్మాణం జరిగినప్పుడు ఫోజులిచ్చిన నాయకులు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదన్నారు.