అన్నదమ్ముల సంగ్రామంలో తుని టీడీపీ నలిగిపోతోందా? ఇన్నాళ్ళు అన్న చాటు రాజకీయం చేసిన తమ్ముడు ఇక హ్యాండిచ్చేసినట్టేనా? కీలకమైన టైంలో యనమల కృష్ణుడు పత్తా లేకుండా పోవడాన్ని ఎలాచూడాలి? ఉక్కపోత భరించలేని తమ్ముళ్ళు ఫ్యాన్ కిందికి చేరుతున్నది నిజమేనా? కృష్ణుడు లేని కురుక్షేత్రం అంటూ సోషన్ మీడియా పోస్టింగ్స్ వెనక ఉద్దేశ్య ఏంటి? తుని తెలుగుదేశం పార్టీలో మంటలు మండిపోతున్నాయట. పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరమైపోయారు సీనియర్ లీడర్, యనమల రామకృష్ణుడి సోదరుడు కృష్ణుడు. పార్టీకి, వ్యక్తిగతంగానూ… అత్యంత కీలకమైనఈ టైంలో పసుపు జెండాను పక్కన పెట్టేసి ఇంటికే పరిమితం అయ్యారు కృష్ణుడు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకి వరసకు సోదరుడు కృష్ణుడు. రామకృష్ణుడు రాష్ట్ర స్థాయి నాయకుడిగా వ్యవహారాలు చక్కబెడుతుంటే… సొంత నియోజకవర్గం తునిలో అంతా తానై నడిపించేవారు కృష్ణుడు. ఇంకా గట్టిగా చెప్పుకోవాలంటే లోకల్‌గా అన్నకంటే తమ్ముడికే గ్రిప్ ఎక్కువన్నది పార్టీ కేడర్ మాట. 2009లో చివరిసారి తుని నుంచి పోటీ చేసి ఓడిపోయారు రామకృష్ణుడు… ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు… 2014, 2019 ఎన్నికల్లో తుని నుంచి సైకిల్ పార్టీ తరఫున కృష్ణుడు పోటీ చేసినా ఓటమి తప్పలేదు. ఈసారి కూడా తనకే తుని టిక్కెట్ అన్న ధీమాతో కృష్ణుడు పని చేసినా… రామకృష్ణుడు కుమార్తె దివ్య లైన్‌లోకి వచ్చేశారు. అంత వరకు ఓకే అనుకున్నా… ఆమె వస్తూనే… బాబాయ్ వర్గం మొత్తాన్ని దూరం పెట్టడంతో దుమారం రేగింది. కృష్ణుడి అనుచరులు ప్రచారానికి రావాల్సిన అవసరం లేదని కూడా క్లారిటీ ఇచ్చేశారట రామకృష్ణుడు.
దాంతో ఆయన వర్గంగా పేరున్న నేతలు ఒక్కొక్కరుగా సైకిల్ దిగిపోతున్నారు. ఒకవైపు తాము నమ్ముకున్న నేత అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోవడం, మరోవైపు రామకృష్ణుడు దూరం పెట్టడంతో…గత్యంతరం లేక ఫ్యాన్ కిందికి చేరిపోతున్నారట కార్యకర్తలు. ఎన్నికల సమయంలో అటు ఇటు కాకుండా… ఉక్కిరిబిక్కిరి అవడం కంటే ఎవరో ఒకరిని నమ్ముకోవడం బెటర్ అని లెక్కలేసుకుంటున్నారట కొందరు టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు. అదే సమయంలో కృష్ణుడు వర్గం కూడా సోషల్ మీడియా పోస్టింగ్స్‌తో హోరెత్తిస్తోంది. తునిలో తొలిసారి కృష్ణుడు లేకుండానే కురుక్షేత్రం జరుగుతోందంటూ హడావిడి చేస్తున్నారు. అదే సమయంలో రామకృష్ణుడు కూడా కృష్ణుడు దూరంగా ఉంటేనే పార్టీకి ప్లస్ అవుతుందని అంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన వ్యవహారశైలి వల్లనే రెండు సార్లు పార్టీ ఓడిపోయిందని, నెగిటివ్ ఏదన్నా ఉంటే కృష్ణుడితోనే పోతుందని కూడా కుండబద్దలు కొట్టేస్తున్నట్టు తెలిసింది. ఇలా బ్రదర్స్ మధ్య జరుగుతున్న వార్‌తో అధికార పార్టీ కూడా అలెర్ట్ అయిందట… మొదట్లో కృష్ణుడు కూడా వైసీపీలోకి వెళ్ళిపోతారని ప్రచారం జరిగింది. ప్రత్తిపాడు సీటు అడగడం, అప్పటికే అక్కడ అభ్యర్థిని ప్రకటించి ఇక మార్చే పరిస్థితి లేకపోవడంతో హోల్డ్ లో ఉండిపోయారాయన. మరోవైపు నాలుగు మండలాల్లో ఉన్న కృష్ణుడు వర్గానికి చెందిన కీలక నేతలపై కన్నేసింది వైసీపీ. ప్రస్తుతానికి కృష్ణుడి వ్యవహారం ఎలా ఉన్నా… ఆయనతో ఉన్న వారిని తన వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉందట. కృష్ణుడు మాత్రం అన్న కోసం ఇంత చేస్తే కూతురి భవిష్యత్ పేరుతో తనను బలి పశువును చేశారంటూ రగిలిపోతున్నట్టు తెలిసింది. ఓడిపోతాననుకున్నప్పుడు తనకు టిక్కెట్ ఇప్పించి… గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న టైంలో కూతురుని ఎంకరేజ్ చేస్తున్నారంటూ గరం గరం అవుతున్నారట. మొత్తంగా తుని బ్రదర్స్ వార్‌ని అనుకూలంగా మార్చుకునే పనిలో వైసీపీ ఉంటే… టీడీపీ ఎలా కౌంటర్ చేసుకుంటుందా అన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది.