ఆస్కార్ బరిలో ‘బిగ్ ఫైవ్’ గా పేర్కొనే “బెస్ట్ ఫిలిమ్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే” విభాగాల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి ‘బిట్రిష్ ఫిలిమ్ అవార్డులు’. ఫిబ్రవరి 19న జరిగిన ‘బ్రిటిష్ ఫిలిమ్ అవార్డుల’లో విజయం సాధించిన వారందరిలో చాలామంది ఆస్కార్ నామినేషన్లు కూడా సంపాదించారు. ఆస్కార్ అవార్డులపై ఈ బ్రిటిష్ అవార్డు ప్రభావమూ ఉంటుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. దాంతో ఇక్కడ విజేతలుగా నిలచిన వారిలో ‘ఆస్కార్ ఆశలు’ రెట్టింపయ్యాయని తెలుస్తోంది.
Also Read : Nandamuri Balakrishna: బాలయ్యకు వార్నింగ్ ఇచ్చిన పిచ్చోడు.. ఎవరతను..?
అయితే బ్రిటిష్ అవార్డుల నామినేషన్లను, ఆస్కార్ నామినేషన్లను పరిశీలిస్తే వింతగానూ అనిపిస్తుంది. బ్రిటిష్ అవార్డుల్లో ‘ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్’ సినిమా ఏకంగా 14 నామినేషన్లు సంపాదించి, ఏడు అవార్డులను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాకు ఆస్కార్ బరిలో కేవలం తొమ్మిది నామినేషన్లే దక్కాయి. దీనికి పోటీగా ఆస్కార్ బరిలో తన సత్తా చాటుకున్న ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్’ చిత్రం ఏకంగా 11 ఆస్కార్ నామినేషన్లు సంపాదించింది. కానీ, బ్రిటిష్ అవార్డుల్లో మాత్రం ఈ సినిమా తక్కువ నామినేషన్లు పోగేసి, చివరకు ఒకే ఒక్క ‘బెస్ట్ ఎడిటర్’ విభాగంలో విజేతగా నిలచింది. చిత్రమేమిటంటే – బ్రిటిష్ అవార్డుల్లో ‘బెస్ట్ డైరెక్షన్’ విభాగంలో నామినేషన్ పొంది, విజేతగానూ నిలచిన ‘ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్’ దర్శకుడు ఎడ్వర్డ్ బెర్గర్ ఆస్కార్ బరిలో కనీసం నామినేషన్ దక్కించుకోక పోవడం విశేషం! ఇలా బ్రిటిష్ అవార్డుల్లో సత్తా చాటిన ‘ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్’ ఆస్కార్ అవార్డుల్లో ఏ మేరకు సాగుతుందో చూడాలన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
Also Read : Hansika Motwani: శింబుతో లవ్ అఫైర్.. పెళ్లి తరువాత నోరు విప్పిన దేశముదురు బ్యూటీ
ఇదిలా ఉంటే, అక్కడా ఇక్కడా నామినేషన్లు సంపాదించినవారిలో ‘బ్రిటిష్ అవార్డులు’ ఆశలు రేకెత్తిస్తున్నాయి. బెస్ట్ పిక్చర్ విభాగంలో బ్రిటిష్ అవార్డు సంపాదించిన ‘ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్’ నిర్మాతల ఆశలు రెట్టింపయ్యాయి. అలాగే ‘బెస్ట్ యాక్టర్’ విభాగంలో బ్రిటిష్ అవార్డు పొందిన ‘ఎల్విస్’ సినిమా యాక్టర్ ఆస్టిన్ బట్లర్ కు కూడా ఆస్కార్ ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. ‘టార్’ సినిమాతో ఉత్తమ నటిగా బ్రిటిష్ అవార్డు అందుకున్న కేట్ బ్లాంచెట్ కు ఆస్కార్ కూడా వచ్చే అవకాశం ఉందని విశేషంగా వినిపిస్తోంది. ఆంగ్ల చిత్రం ‘బన్షీస్ ఆఫ్ ఇన్ షెరిన్’ చిత్రం ద్వారా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా బ్రెండాన్ గ్లీసన్, అదే చిత్రం ద్వారా బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా కెర్రీ కాండన్ బ్రిటిష్ అవార్డులు సొంతం చేసుకున్నారు. వీరు కూడా ఆస్కార్ నామినేషన్లు పొందిన వారే. దాంతో వీరిలోనూ ఆస్కార్ ఆశలు రెట్టింపయ్యాయనే చెప్పాలి.
బ్రిటిష్ అవార్డుల్లో బెస్ట్ సినిమాటోగ్రఫి అవార్డు అందుకున్న జేమ్స్ ఫ్రెండ్ (ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్), బెస్ట్ ఎడిటర్ గా నిలచిన పాల్ రోగర్స్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్), ఒరిజినల్ స్కోర్ లో ఉత్తమంగా నిలచిన ఓకర్ బెట్ల్ మన్ (ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్), బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే అవార్డు సొంతం చేసుకున్న ‘ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్’ రైటర్స్ కూడా ఆస్కార్ అవార్డులూ దక్కించుకుంటామనే ధీమాతో ఉన్నారు. ఇదిలా ఉంటే, ‘బ్రిటిష్ అవార్డుల్లో’ ‘బెస్ట్ నాన్ ఇంగ్లిష్ మూవీ’గా అంటే ఇదే విభాగం ఆస్కార్ లో ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిమ్’ అవార్డు కేటగిరీలో ఉంది. ఈ విభాగంలోనూ ‘ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్’ బ్రిటిష్ అవార్డు పట్టేసింది. కాబట్టి ఆ చిత్ర నిర్మాతలకు ఆస్కార్ అవార్డుల విషయంలోనూ ఆశలు ఆకాశాన్ని అంటుతున్నాయనే చెప్పాలి. ఇలా బ్రిటిష్ అవార్డులు సొంతం చేసుకున్న పలువురు విజేతలు ఆస్కార్ లోనూ తమకే ఆస్కారం ఉందని ఆశిస్తున్నారు. మరి ఎవరు ఇక్కడా, అక్కడా విజేతలుగా నిలుస్తారో చూడాలి.
