మరికాసేపట్లో పెళ్లి. ఇళ్లంతా సందడి వాతావరణం నెలకొంది. పెళ్లికి వచ్చిన బంధువులు సంగీత్ లో పాల్గొని ఆనందంగా గడుపుతున్నారు. కానీ ఇక్కడే విది వింతనాటకం ఆడింది. పెళ్లికూతురు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయింది. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్ జిల్లాలోని బర్గాడి గ్రామంలో జరిగిన విషాద సంఘటన మొత్తం గ్రామాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. వధువు పూజ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె గుండెపోటుతో మరణించినట్లు ప్రకటించారు.
మృతురాలు పూజ వయసు 20 సంవత్సరాలు, అక్టోబర్ 24న దుబాయ్‌లో పనిచేస్తున్న యువకుడితో ఆమె వివాహం జరగాల్సి ఉంది. రెండు కుటుంబాల అంగీకారంతో ఈ వివాహం జరుగుతోంది. పూజ తండ్రి హర్జిందర్ సింగ్ తన కుమార్తె వివాహాన్ని ఘనంగా చేసేందుకు ఏర్పాట్లు చేశాడు. కానీ పూజ ఆకస్మిక మరణం గ్రామాన్ని, ఇంటిని శోకసంద్రంలో ముంచెత్తింది. ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు షాక్‌లో ఉన్నారు. గుండెలవిసేలా రోదించారు. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పులు మోగడంతో ప్రతి ఒక్కరి కంట కన్నీరు తెప్పించింది. తమ కూతురు అత్తవారింటికి వెళ్లి సంతోషంగా జీవిస్తదని కలలు కన్న ఆ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది.