Brahmanandam: నవ్వుకే నవ్వు పుట్టించిన ఘనుడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brahmanandam: మొన్నటి దాకా తీరిక లేకుండా నవ్వులు పండించిన హాస్యనటబ్రహ్మ బ్రహ్మానందం ఇప్పటికీ తన దరి చేరిన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేస్తూనే ఉన్నారు. నవ్వులు మన సొంతం చేస్తూనే ఉన్నారు. కేవలం నటించడమే కాదు, తనలో చిత్రలేఖనం అనే కళ కూడా పరిపూర్ణంగా ఉందని చాటుకున్నారు బ్రహ్మానందం. కరోనా సమయంలో ఖాళీ దొరకడంతో బ్రహ్మానందంలోని చిత్రకళ బహిర్గతమై పలు అపురూప చిత్రాలను జనం ముందు నిలిపింది. అయినా, ఆయన నవ్వుల బ్రహ్మానందంగానే జనానికి సుపరిచితులు. ఆయన నవ్వులు కేవలం తెలుగువారినే కాదు, తెలుగు అర్థం కాని వారినీ అలరించాయి. తెలుగు నుండి తమ భాషల్లోకి అనువాదమైన చిత్రాలలో బ్రహ్మానందం హాస్యాభినయం చూసి పరభాషల వారు సైతం కితకితలకు గురవుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఏ ముహూర్తాన ఆయన కన్నవారు బ్రహ్మానందం అని నామకరణం చేశారో కానీ, అందరికీ ఆనందం పంచడానికే ఈ బ్రహ్మానందం అన్నట్టుగా ఆయన చలన చిత్రజీవితం సాగింది.
కన్నెగంటి బ్రహ్మానందం 1956 ఫిబ్రవరి 1న గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జన్మించారు. ఎంతగా నవ్వులు పూయించినా, శ్రద్ధగా చదువుకొని అధ్యాపకునిగా మారారు. అత్తిలిలో అధ్యాపకునిగా కొనసాగుతూనే బ్రహ్మానందం పలు సాంస్కృతిక కార్యక్రమాలలో తన స్వరఅనుకరణతో అలరించే వారు. దూరదర్శన్ లో బ్రహ్మానందం పండించిన ‘పకపకలు’ ఇప్పటికీ గుర్తు చేసుకొని నవ్వుకొనేవారెందరో! జంధ్యాల ‘సత్యాగ్రహం’లో ఓ చిన్న పాత్రలో తొలిసారి కనిపించారు బ్రహ్మానందం. వేజెళ్ళ సత్యనారాయణ ‘శ్రీతాతావతారం’లోనూ ఓ బిట్ రోల్ చేశారు. జంధ్యాల ‘అహ నా పెళ్ళంట’లో అరగుండుగా నటించి, అందరికీ దగ్గరయ్యారు బ్రహ్మానందం. ఆ తరువాత ఆయన మరి వెనుదిరిగి చూసుకోలేదు. అందిన ప్రతీ అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూ సాగారు. అందరికీ నవ్వులు పంచుతూనే తెలుగునాట హాస్యనటుల్లో అగ్రస్థానం అధిరోహించారు. బ్రహ్మానందానికి ముందు రేలంగి, అల్లు రామలింగయ్య ఇద్దరూ తమదైన హాస్యంతో పకపకలు పండించారు. వారిద్దరికీ పద్మ పురస్కారం లభించింది. వారి తరువాత తెలుగునాట ‘పద్మ’ పురస్కారం అందుకున్న నవ్వుల రేడు బ్రహ్మానందమే!
Also Read
- Telangana Eagle Force: తెలంగాణ ఈగల్ ఫోర్స్ సమాచారంతో భారీ ఆపరేషన్.. నాగ్‌పూర్‌లో రూ.1.75 కోట్ల డ్రగ్స్ సీజ్
- Senior Heroines: టాలీవుడ్‌కు దూరమైన స్టార్ హీరోయిన్లు.. అనుష్క నుంచి తమన్నా ఇప్పుడు ఏం చేస్తున్నారు?
- AP Panchayat Elections 2026: రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు.. కత్తులు, వేట కొడవళ్లతో దాడులు!
- 144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, 50MP పెరిస్కోప్ కెమెరాతో Vivo X500e లాంచ్..!
ఒకటా రెండా వందలాది చిత్రాల్లో బ్రహ్మానందం పండించిన నవ్వులు జనానికి కితకితలుపెట్టాయి. ఈ నాటికీ వాటిని తలచుకుంటే చాలు గొల్లున నవ్వులు రాలతాయి. బ్రహ్మానందం హాస్యానికి ఇప్పటికి ఐదు సార్లు నంది పురస్కారాలు దక్కాయి. “మనీ, అనగనగా ఒక రోజు, వినోదం, రెడీ, రేసుగుర్రం” చిత్రాలతో ఉత్తమ హాస్యనటునిగా ఐదు నందులు అందుకున్నారు. ఈ కామెడీ కింగ్ కరుణరసంతోనూ మురిపించిన సందర్భాలున్నాయి. అలా ఉత్తమ సహాయనటునిగానూ ‘అన్న’తో నందిని పట్టుకుపోయారు. ఇలా ఆరు సార్లు నందిని అందుకున్న బ్రహ్మానందం, వెయ్యికి పైగా చిత్రాలలో నటించి, ఈ నాటికీ నవ్వులు పూయిస్తున్న హాస్యనటునిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్స్ లోనూ చోటు సంపాదించారు.
తెలుగు హాస్యనటుల చరిత్ర రాయవలసి వస్తే, బ్రహ్మానందానికి ముందు, బ్రహ్మానందానికి తరువాత అని రాయాలని పలువురు ప్రముఖులు ప్రశంసించిన సందర్భాలున్నాయి. బ్రహ్మానందం కామెడీతో జనానికి కడుపులు చెక్కలు కావడం మొదలయిన తరువాత నుంచీ హాస్యాభినయంపై మమకారం పెంచుకున్న వారెందరో ఉన్నారు. బ్రహ్మానందం చూపిన బాటలో ‘మిమిక్రీ’ చేస్తూ హాస్యం పంచవచ్చునని భావించిన వారు తొలుత స్వర అనుకరణతో జనాన్ని మెప్పించి, తరువాత చిత్రసీమలో రాణించారు. అలాంటివారికి సైతం బ్రహ్మానందం తగిన ప్రోత్సాహమిచ్చారు. ఇక తమ హాస్యనటుల్లో కూడా కథానాయకులుగా రాణించగల దిట్టలు ఉన్నారంటే, వారికీ తగిన ప్రోత్సాహం అందించారు. తమ హాస్యకుటుంబంలోని కొందరు సభ్యులు దర్శకులుగా మారడానికీ ఆయన ప్రోత్సాహమే కారణం. అందుకే తెలుగు సినిమా హాస్య చరిత్రలో బ్రహ్మానందంకు ముందు, తరువాత అని రాయాల్సి ఉంటుందని అంటారు. ఏది ఏమైనా బ్రహ్మానందం పేరు వినగానే అసంకల్పితంగా కితకితలు మొదలవుతాయి, తరువాత మన పెదాలపై నవ్వులు నాట్యం చేస్తాయి. ఆయన మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగాలని ఆశిద్దాం.
తాజావార్తలు
-
Telangana Eagle Force: తెలంగాణ ఈగల్ ఫోర్స్ సమాచారంతో భారీ ఆపరేషన్.. నాగ్‌పూర్‌లో రూ.1.75 కోట్ల డ్రగ్స్ సీజ్
-
Los Angeles Earthquake: భూకంపం బీభత్సం.. ల్యాండింగ్‌కు సిద్ధమైన విమానం.. గాల్లోనే వెనక్కి మళ్లించిన ATC (వీడియో)
-
Senior Heroines: టాలీవుడ్‌కు దూరమైన స్టార్ హీరోయిన్లు.. అనుష్క నుంచి తమన్నా ఇప్పుడు ఏం చేస్తున్నారు?
-
AP Panchayat Elections 2026: రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు.. కత్తులు, వేట కొడవళ్లతో దాడులు!
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, 50MP పెరిస్కోప్ కెమెరాతో Vivo X500e లాంచ్..!
ట్రెండింగ్
-
IND vs NZ 2nd Test: రెండో టెస్టులో సిరాజ్‌కు మళ్లీ నిరాశ.. ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు ఛాన్స్!
-
9,000mAh బ్యాటరీ, 200MP కెమెరా, కూలింగ్ ఫ్యాన్, 185Hz డిస్ప్లేతో రానున్న Realme 17 Ultra..!
-
IND vs NZ Test: కుప్పకూలిన భారత్.. 110 పరుగుల భారీ ఆధిక్యంలో న్యూజిలాండ్.!
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?