Bonda Uma: ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరైన నేపథ్యంలో సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలు, రాజకీయ చర్చలపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు స్పందించారు. తాను ఎప్పుడూ పార్టీ లైన్ దాటలేదని, భవిష్యత్తులో కూడా టీడీపీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇకపై వైసీపీ నేతలు పాల్గొనే సమావేశాలకు హాజరుకానని కూడా ప్రకటించారు. టీడీపీ ప్రధాన కార్యాలయానికి వచ్చి.. పార్టీ నేతలకు తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు వెళ్లడం పూర్తిగా వ్యక్తిగత, మర్యాదపూర్వక కార్యక్రమమని తెలిపారు. ఆ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఉండటంతో వారిని కలవాల్సి వచ్చిందని, దానికి రాజకీయ రంగు పులమడం సరికాదన్నారు.
సంస్మరణ సభలో జరిగిన పరిణామాలను కొన్ని దుష్టశక్తులు కావాలనే వక్రీకరించి ప్రచారం చేశాయని బోండా ఉమా ఆరోపించారు. తనకు, టీడీపీకి మధ్య విభేదాలు సృష్టించాలని కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తాను మాట్లాడిన ప్రతి మాటకు రికార్డు ఉందని, చెప్పని విషయాలను కూడా చెప్పినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీలో తాను 25 సంవత్సరాలుగా కొనసాగుతున్నానని, ఈ కాలంలో ఒక్కసారి కూడా పార్టీ లైన్ దాటలేదని బోండా ఉమా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు, పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎప్పుడూ ప్రవర్తించలేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు పార్టీ కష్టకాలంలో తాను ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పార్టీ కోసం పనిచేశానని గుర్తు చేశారు.
ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు తాను ఉదయం 11 గంటలకు వెళ్లి, మధ్యాహ్నం 12 గంటలకే బయటకు వచ్చానని చెప్పారు ఉమా.. ఆ సమయంలో వైసీపీ నేత అంబటి రాంబాబు తన వద్దకు వచ్చి పలకరించారని, అంతకుమించి ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని వివరించారు. ఈ అంశంపై ఇప్పటికే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడులకు పూర్తి వివరణ ఇచ్చినట్లు ఉమా తెలిపారు. అయినప్పటికీ జరిగిన విషయాలను వక్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేయడం వల్ల అనవసర అపోహలు ఏర్పడ్డాయని అన్నారు.
భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటానని బోండా ఉమా స్పష్టం చేశారు. పార్టీ లైన్ దాటే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని, ఇకపై వైసీపీ నేతలు ఉన్న కార్యక్రమాలకు వెళ్లబోనని వెల్లడించారు. ఇక, త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లను కలిసి ఈ అంశంపై వివరణ ఇస్తానని తెలిపారు. పార్టీపై తనకు పూర్తి నిబద్ధత ఉందని, టీడీపీ కష్టకాలంలో ఎలా అండగా నిలిచానో, భవిష్యత్తులో కూడా అదే విధంగా పార్టీ కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని పార్టీ శ్రేణులు, ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు బోండా ఉమామహేశ్వరరావు..

