సోషల్ మీడియా యుగంలో ఏ విషయాన్నైనా నెటిజన్లు ఇట్టే తవ్వి తీస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటీమణులు విద్యాబాలన్, కియారా అద్వానీలు గతంలో మతం, ఆహారపు అలవాట్లపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. విద్యాబాలన్ ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారతదేశం ప్రస్తుతం మతపరంగా విడిపోయిందని, పూర్వం దేశానికి ఇంతటి మతపరమైన గుర్తింపు ఉండేది కాదని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, తాను ఆధ్యాత్మిక వ్యక్తినైనప్పటికీ గుడులు, మసీదులు వంటి మతపరమైన కట్టడాలకు విరాళాలు ఇవ్వనని, కేవలం ఆసుపత్రులు, పాఠశాలలు లేదా టాయిలెట్లు కట్టేందుకే సాయం చేస్తానని స్పష్టం చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
Also Read : Swayambhu : నిఖిల్ భారీ చిత్రం ‘స్వయంభూ’ రిలీజ్ డేట్ ఫిక్స్..
మరోవైపు, కియారా అద్వానీ కూడా ఒక పాత వీడియోతో నెటిజన్ల ఆగ్రహానికి గురవుతోంది. దేశంలో బీఫ్ (గోమాంసం), పోర్క్ నిషేధించడం వల్ల స్వేచ్ఛను కోల్పోయామన్న అర్థం వచ్చేలా ఆమె చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. అసలు దేశవ్యాప్తంగా బీఫ్ ఎక్కడా పూర్తిగా నిషేధించబడలేదని, కనీస అవగాహన లేకుండా ఇలాంటి సున్నితమైన విషయాలపై మాట్లాడటం బాధ్యతారాహిత్యమని నెటిజన్లు క్లాస్ పీకుతున్నారు. గతంలో అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోలు కూడా ఇలాంటి వ్యాఖ్యల వల్ల ‘బాయ్ కాట్’ సెగను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పాత వీడియోలు బయటకు రావడంతో ఈ భామలు కూడా అదే స్థాయి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.