BMC Election Exit Polls: బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో బీజేపీ–శివసేన కూటమి విజయం దాదాపు ఖరారైనట్టుగా ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఆసియాలోనే అత్యంత సంపన్నమైన ఈ మున్సిపల్ సంస్థలో మొత్తం 227 వార్డులు ఉండగా, బీజేపీ–శివసేన కలిసి 130కిపైగా స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా. ఆక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. బీజేపీ–శివసేన కూటమికి 131 నుంచి 151 సీట్లు రావొచ్చు. జేవీసీ ఎగ్జిట్ పోల్స్ కూడా కూటమి 138 వార్డులు దక్కించుకుంటుందని అంచనా వేసింది. ఏడు సంవత్సరాల తర్వాత జరిగిన ఈ ఎన్నికలు తీవ్ర పోటాపోటీగా సాగాయి. మారుతున్న కూటములు, వ్యూహాత్మక కలయికలు, మరాఠీ అస్మితపై పోరు ఎన్నికలను మరింత ఉత్కంఠభరితంగా మార్చాయి.
READ MORE: Se*xual Harassment: బాల్యంలో పదే పదే లైంగిక వేధించారు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన ప్రముఖ నటి
ఇరవై ఏళ్ల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే కలిసి పోటీ చేసినా ఆశించిన ఫలితం దక్కేలా కనిపించడం లేదు. ఆక్సిస్ మై ఇండియా అంచనా ప్రకారం శివసేన (యూబీటీ)–ఎంఎన్‌ఎస్ కూటమికి 58 నుంచి 68 సీట్లు రావొచ్చు. జేవీసీ ఎగ్జిట్ పోల్స్ అయితే ఈ కూటమికి 59 వార్డులు మాత్రమే వస్తాయని తేల్చి చెప్పింది. చివరి నిమిషంలో ప్రకాశ్ అంబేడ్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ ఆఘాడీతో చేతులు కలిపినా.. కాంగ్రెస్ పరిస్థితి బలహీనంగానే ఉంది. కాంగ్రెస్‌కు గరిష్ఠంగా 12 నుంచి 16 సీట్లు మాత్రమే దక్కే అవకాశముందని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. ముంబైతో పాటు మరో 28 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో మహాయుతి, మహావికాస్ ఆఘాడీ కూటముల్లోనే అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. సిద్ధాంత భేదాలు మసకబారిపోయేలా రాజకీయ సమీకరణాలు మారాయి. శివసేన, ఎన్సీపీ విభజన తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో ఇదే తరహా పరిస్థితి కొనసాగుతోంది. బీఎంసీలో బీజేపీ 137 సీట్లకు, శివసేన 90 సీట్లకు పోటీ చేశాయి. మహాయుతిలోని మరో భాగస్వామి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ మాత్రం ఒంటరిగా బరిలోకి దిగింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే, బీఎంసీపై బీజేపీ–శివసేన ఆధిపత్యం కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.
READ MORE: Se*xual Harassment: బాల్యంలో పదే పదే లైంగిక వేధించారు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన ప్రముఖ నటి