ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత వారం రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై.. వ్యక్తిగతంగా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవాలకు విరుద్ధంగా బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు.. అవగాహన, అనుభవ రాహిత్యంతో, అసహంతో మాట్లాడుతున్నారని ఆరోపించారు. తాను కేంద్ర మంత్రిగా చేసిన పనులు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియ చేస్తున్నానని.. కేంద్ర పథకాల్ని తెలంగాణలో అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేక పోవడంతో కొన్ని అమలు చేయలేక పోయామని పేర్కొ్న్నారు. 14 నెలల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక తన మీద దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, ఆయన పైన అసంతృప్తి.. ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు.
బీజేపీని బ్లాక్ మెయిల్ చేసినంత మాత్రాన రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత పోదని కిషన్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి మాట తెలంగాణ ప్రజకు నమ్మే పరిస్థితి లేదు.. తాను అంకిత భావంతో పని చేస్తున్నానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారం కోసం కేసీఆర్‌కు 40 ఉత్తరాలు రాశానని.. రేవంత్ రెడ్డికి కూడా ఉత్తరాలు రాశానని అన్నారు. తెలంగాణ రేవంత్ రెడ్డి సొంత జాగీరా.. రేవంత్ రెడ్డి మీద కోపంతో తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటామా.. అని అన్నారు. విలువలకు కట్టుబడి పని చేస్తానని.. చిన్నప్పటి నుండి సిద్ధాంతం కోసం పని చేశా.. నీ తాటాకు చప్పుళ్ళకు భయపడనని రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సూచించారు. ఇచ్చిన హామీలు అమలు చేయక తమ మీద దాడి చేస్తున్నారని మండిపడ్డారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, మహిళకు 2,500 ఇవ్వలేదు… రైతు భరోసా లేదని పేర్కొన్నారు.
Read Also: SLBC Tunnel: 5 మృతదేహాల వెలికి తీత?.. మూడింటి కోసం ముమ్మర గాలింపు..
లక్ష 66 వేల కోట్లకు పైగా నిధులు మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి తనకు రాసిన ఉత్తరంలో పేర్కొన్నారని కిషన్ రెడ్డి తెలిపారు. తమను అడుగుతున్న ప్రాజెక్టుల్లో రాష్ర్ట ప్రభుత్వం ఎంత బడ్జెట్ కేటాయింపు చేసింది..సీనియర్ అధికారులు నవ్వు కుంటున్నారని అన్నారు. ఇంత టైమ్‌లో కేంద్ర ప్రభుత్వం ఇన్ని నిధులు ఏ రాష్ట్రానికి కూడా ఇవ్వలేదని అన్నారు. రెండున్నర నెలలలో ప్రాజెక్టులు అన్నీ మంజూరు అవుతాయా అని ప్రశ్నించారు. రీజినల్ రింగ్ రోడ్డు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్… భూ సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశామని కిషన్ రెడ్డి తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం కేవలం వంద కోట్ల రివాల్వింగ్ ఫండ్ పెట్టిందని పేర్కొన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే మెట్రో రెండో దశ సంబంధించిన కేంద్రానికి పంపించారు.. రేవంత్ రెడ్డి మెట్రోను ఆపాలని కేంద్రానికి లేఖ రాశారు.. మార్పులు చేసి పంపిస్తామని చెప్పారన్నారు.
మరోవైపు.. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2ను కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేయదని కిషన్ రెడ్డి చెప్పారు. రేవంత్ మొఖం చూసో, నేను వద్దంటున్న మెట్రో ఆగదన్నారు. మరోవైపు.. ఏపీలో బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చిన రోజు మతపరమైన రిజర్వేషన్లను ఎత్తి వేస్తుందని తెలిపారు. ముస్లింలు.. బీసీల రిజర్వేషన్లను తన్నుకు పోతామంటే ఎలా ఊరుకుంటామని అన్నారు. ముస్లిం రిజర్వేషన్‌లను హైకోర్టు కొట్టివేసిందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. త్రిభాష సూత్రంను తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆరోపించారు. హిందీ మాట్లాడాలని బీజేపీ చెప్తుందా అని అన్నారు.
నియోజక వర్గ పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరగదన్నారు.