NTV Telugu Site icon

Kishan Reddy: బీసీలను అందరూ మోసం చేశారు.. అండగా నిలిచింది బీజేపీ మాత్రమే..

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy: ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన చాలామంది బీజేపీలో చేరారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఇంకో రెండు మూడు రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుందని, బీజేపీ పూర్తిస్థాయిలో ప్రచారాన్ని వచ్చే నెల 3 నుంచి నిర్వహిస్తామన్నారు. జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు ప్రచారానికి వస్తారని కిషన్‌ రెడ్డి తెలిపారు. ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది.. బీజేపీ నేత ముఖ్యమంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీసీలను అందరూ మోసం చేశారని.. బీసీ ముఖ్యమంత్రిగా ప్రకటించి వారికి అండగా నిలిచింది బీజేపీ మాత్రమేనన్నారు. అన్ని బీసీ కులాలు, సంఘాలు బీజేపీకి మద్దతు తెలుపుతున్నాయన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేశామన్నారు.

బీఆర్ఎస్ గెలిస్తే దళిత ముఖ్యమంత్రి హామీ ఇచ్చి కేసీఆర్ మోసం చేశారని కిషన్‌ రెడ్డి విమర్శలు గుప్పించారు. దళితులకు పాలన చేయడం చేతకాదని, అందుకే తానే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడుతున్నానని వారిని అవమానించారన్నారు. దళితులను వెన్నుపోటు పొడిచిన చరిత్ర బీఆర్ఎస్‌ది అంటూ ఆయన మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన మొదటి అయిదేండ్లలో మంత్రి వర్గంలో ఒక్క మహిళలకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. మతపరమైన రిజర్వేషన్లు తెచ్చి బీసీలకు కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచిందన్నారు. దీనివల్ల బీసీల సీట్లు ముస్లింలకు పోయాయయన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కేబినేట్ నిర్ణయం తీసుకుని ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్నారు. మైనార్టీ, దళిత, గిరిజన బిడ్డలను రాష్ట్రపతిగా చేసిన ఘనత బీజేపీదేనని ఆయన పేర్కొన్నారు.

Also Read: Bhatti Vikramarka: తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌తోనే ప్రజల కలలు సాకారం..

కాంగ్రెస్ మజ్లీస్‌ను అడ్డుపెట్టుకుని ఓటు బ్యాంకు రాజకీయాలు చేసిందని కిషన్‌ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పీడ విరగడ అయిందనుకుంటే బీఆర్ఎస్ కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఒవైసీ అనుమతి లేనిదే హైదరాబాద్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు తిరగలేరని ఆయన ఎద్దేవా చేశారు. మజ్లీస్ పార్టీ అండదండలతో హైదరాబాద్ లోని కొన్ని ఏరియాల్లో కరెంట్, నీళ్ల బిల్లులు కూడా కట్టడం లేదన్నారు. రౌడీయిజం, గూండాయిజాన్ని మజ్లీస్ పెంచి పోషిస్తోందని అని కిషన్‌ రెడ్డి ఆరోపించారు. సంఘ విద్రోహ శక్తులు, అరాచకాలు చేసే వారిపై యూపీలో యోగి సర్కార్ తరహాలో బుల్డోజర్లు దింపుతామన్నారు. అది మజ్లీస్ అయినా, అక్రమాలు చేసే వారు ఎవరైనా సరే బుల్డోజర్లు దింపుతామన్నారు.

Also Read: BRS Praja Ashirvada Sabha at Alair: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళారీ రాజ్యం: సీఎం కేసీఆర్

కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. “కాంగ్రెస్ పోయిందనుకుంటే.. బీఆర్ఎస్ వచ్చి ప్రజల రక్తాన్ని తాగుతోంది. కుటుంబ పాలన, అవినీతి పాలనపై మోడీ యుద్ధాన్ని ప్రారంభించారు. అవినీతిని కూకటి వేళ్ళతో తొలగించి.. తెలంగాణ సకల జనుల పాలన తీసుకోస్తాం. బీజేపీ అధికారంలోకి వస్తే ఫామ్ హౌజ్ లో పడుకునే ముఖ్యమంత్రి ఉండడు.. రోజుకు 16 నుంచి 18 గంటలు పనిచేసే ముఖ్యమంత్రి వస్తాడు. కర్ణాటకలో లాగా గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసే పార్టీ బీజేపీ కాదు. కాంగ్రెస్ మోసం చేసేందుకు, దగా చేసేందుకు గ్యారెంటీ ఇచ్చింది. బీఆర్ఎస్ కుటుంబ, అవినీతి పాలన, అలాగే గ్యారెంటీల పేరుతో మోసం చేస్తున్న కాంగ్రెస్ పాలన పోవాలి. బీసీ నేతను ముఖ్యమంత్రి చేస్తారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.. మేము బీసీ ప్రధానిని చేశాం, దళిత, గిరిజనులను రాష్ట్రపతిని చేశాం. బీసీ ముఖ్యమంత్రిని చేయడం మాకో లెక్కనా?. ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్‌ను ఫామ్ హౌజ్లోనే పాతర వేయాలి. తెలంగాణలో ఖర్చు పెట్టేందుకు కర్ణాటక నుంచి కాంగ్రెస్ తెస్తున్న నిధులను బార్డర్‌లోనే అడ్డుకోవాలి.” అని కిషన్‌ రెడ్డి అన్నారు.