BJP leader says Encounters needed to save girls in Bengal: మహిళల భద్రతపై బీజేపీ నేత సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో మహిళల భద్రత కోసం అవసరమైతే పోలీసులు ఎన్‌కౌంటర్లను ఆశ్రయించాలని సువేందు అధికారి బుధవారం అన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లాంటి వ్యక్తి మాత్రమే పశ్చిమ బెంగాల్‌లో శాంతిభద్రతలను నియంత్రించగలడని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మహిళలు, పిల్లలకు భద్రత కల్పించడంలో విఫలమయ్యారని రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ఆరోపించారు.
Read Also: Dalai Lama: చంద్రయాన్-3 ల్యాండింగ్‌పై ప్రధాని మోడీ, ఇస్రోను అభినందించిన దలైలామా
కాలేజీ దాటని ఆడ పిల్లలు అఘాయిత్యాలకు గురవుతున్నారని, పశ్చిమ బెంగాల్ హంతకులకు నిలయంగా మారిందని, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లాంటి ఒక్కరే పరిస్థితిని అదుపు చేయగలరని సువేందు అధికారి అన్నారు. “అవసరమైతే ఈ నేరస్థులను ఎన్‌కౌంటర్ చేయాలి. ఈ నేరస్థులకు మనుషులతో జీవించే హక్కు లేదు,” అన్నారాయన.
సువేందు అధికారి వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎమ్మెల్యే తపస్ రాయ్ స్పందిస్తూ.. “బెంగాల్‌ను యోగి రాజ్‌గా మార్చాలని సువేందు ఎంత కోరుకున్నా అది ఎప్పటికీ జరగదు. అత్యాచార కేసుల బాధితులకు చట్టం ద్వారా సత్వర విచారణ, న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. అత్యాచార నేరస్థులను కూడా చట్ట ప్రకారమే మేము కఠినంగా శిక్షించాలనుకుంటున్నాము” అని అన్నారు. ఎన్‌కౌంటర్‌ల గురించి సువేందు మాట్లాడుతున్నారని.. పశ్చిమ బెంగాల్‌లోని ప్రజలు దీనిని సమర్థించరన్నారు. బెంగాల్‌లో తాలిబన్ పాలన ఉండాలని ఆయన కోరుకుంటున్నారా తపస్ రాయ్ ప్రశ్నించారు.