Prakash Reddy: హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క రాష్ట్రంలో ఎరువుల కొరత లేదన్నారు. ఇక రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రికి ఏ పంటకు ఏ ఎరువులు వాడాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఎరువులపై కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. కేంద్రప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీతో 268 అమ్మాల్సిన ఎరువుల బస్తాను రూ.380 కు పైగా అమ్ముతున్నారని అన్నారు. ఎరువులపై కనీసం 50 రూపాయలు భరించలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు. అందుబాటులో ఉన్న యూరియాను రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ మార్కెట్ కు తరలిస్తుందని ఆయన సంచలన కామెంట్స్ చేసారు.
అలాగే యూరియా పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయ్యిందన్నారు. రబీ సీజన్లో 10 లక్షల టన్నుల యూరియాను కేంద్ర ప్రభుత్వం అందించిందని, కేంద్రం నుంచి వస్తున్న ఎరువులను పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయ్యిందన్నారు. ఎరువులపై కేంద్రానికి ఉత్తరం రాశామని.. పబ్లిక్ స్టంట్ కోసం గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రైతులకు సరైన సమయంలో ఎరువులను అందించడంలో రేవంత్ సర్కార్ విఫలం అయ్యిందని, ప్రభుత్వం బ్లాక్ మార్కెట్ దందా చేస్తోందన్నారు. తుమ్మల నాగేశ్వర రావు లేఖ పబ్లిక్ స్టంట్ గా భావిస్తున్నామని.. అంతర్జాతీయంగా ఎరువుల ధరలు పెరిగిన ఒక్క రూపాయి కూడా రైతులపై భారం వేయలేదన్నారు.
Read Also:Sigachi Factory Blast: సిగాచి ఫ్యాక్టరీ అగ్నిప్రమాదం.. దర్యాప్తుకు నిపుణుల కమిటీ ఏర్పాటు
కేంద్రం 12 లక్షల కోట్లు కేవలం ఎరువుల సబ్సిడీపై ఖర్చు చేస్తోందని, మోదీపై దురప్రచారం చేసేందుకే కాంగ్రెస్ ఉత్తరాల డ్రామా ఆడుతుందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు సరైన సమయంలో ఎరువులను అందిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం నిర్వాకాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రైతులకు సరైన సమయంలో ఎరువులను అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్తున్నట్లు ఆయన అన్నారు. రామగుండంలో తయారు అవుతున్న ఎరువులు సగం తెలంగాణకే ఉపయోగిస్తున్నామని, ఎరువులు సరఫరాపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి కొరత లేదని ఆయన అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఎరువులకంటే అదనంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వ బ్లాక్ మార్కెట్ దందాల వల్లే ఎరువుల కొరత ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. ఎరువుల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మార్చుకోకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని.. తుమ్మల నాగేశ్వర్ రావు డ్రామాలు ఆపి, ఎరువుల పంపిణీపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.