NTV Telugu Site icon

Election Results 2022: గుజరాత్‌లో బీజేపీ చారిత్రాత్మక విజయం.. హిమాచల్‌లో కాంగ్రెస్‌దే పీఠం

Election Results

Election Results

Election Results 2022: గుజరాత్‌లో సరికొత్త రికార్డు సృష్టిస్తూ కమలం పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. వరుసగా ఏడోసారి విజయం సాధించి 37 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. 182 స్థానాల్లో 156 స్థానాలను కైవసం చేసుకుంది. మోదీ మ్యాజిక్‌తో 156 నియోజకవర్గాల్లో జయకేతనాన్ని ఎగురవేసింది. 54శాతం ఓట్లను దక్కించుకుంది. బీజేపీ దెబ్బకు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్ష హోదాను దక్కించుకునే అవకాశం కూడా లేకుండాపోయింది. 20 సీట్లు కూడా గెలవలేక చతికిలపడింది. గుజరాత్‌లో ఎన్నికల ఆరంగేట్రం చేసిన ఆమ్‌ ఆద్మీ పార్టీ 12శాతం ఓట్లను కొల్లగొట్టింది. కాంగ్రెస్ 17 స్థానాలను కైవసం చేసుకోగా.. ఆమ్‌ ఆద్మీ పార్టీ 5 స్థానాల్లో విజయం సాధించింది. డిసెంబర్‌ 12న భూపేంద్ర పటేల్‌ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

తాజా ఎన్నికల్లో బీజేపీ 150కి పైగా సీట్లు గెలిచి రికార్డు సృష్టించింది. గుజరాత్‌లోఓ పార్టీ గెలుచుకున్న అత్యధిక స్థానాలు ఇవే. 1985లో మాధవ్ సిన్హ్ సోలంకీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ 149 సీట్లు గెలుచుకుంది. అత్యధిక సీట్లు దక్కించుకొని బీజేపీ తన సొంత రికార్డును కూడా బద్దలు కొట్టింది. గతంలో ఆరుసార్లు గెలుపొందిన బీజేపీ.. 2002లో గరిష్ఠంగా 127 సీట్లు గెలుచుకుంది. తాజా ప్రదర్శనతో ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. వరుసగా ఏడు సార్లు ఓ రాష్ట్రంలో మెజారిటీ సాధించడం ద్వారా మరో రికార్డును తన పేరిట లిఖించుకుంది.

TRS Turns BRS: బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్.. సీఈసీ ఆమోదం

భారత్​ జోడో యాత్రతో పార్టీ శ్రేణుల్లో పునరుత్తేజం నింపేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న హస్తం పార్టీకి గుజరాత్​ ఎన్నికల రూపంలో గట్టి షాక్ తగిలింది. బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టలేకపోగా బలమైన ప్రతిపక్షంగా కూడా నిలవలేని దుస్థితికి చేరింది. 2017 ఎన్నికలతో పోల్చితే ఈసారి హస్తం గుర్తుపై గెలిచిన అభ్యర్థుల సంఖ్య భారీగా పడిపోయింది. 1995లో 149 సీట్లు సాధించి రికార్డు సృష్టించిన కాంగ్రెస్.. అప్పటి నుంచి వరుసగా ఏడు సార్లు ఓటమిపాలైంది. 2017లో కాస్త తేరుకున్నా.. 2022లో మాత్రం బోల్తా కొట్టింది. భాజపా ధాటికి తట్టుకోలేక చతికిలపడిపోయింది. గుజరాత్ అసెంబ్లీలో 182 సీట్లు ఉన్నాయి. ప్రతిపక్ష నాయకుడిని ఎంపిక చేసేందుకు పార్టీకి కనీసం 10 శాతం బలం అవసరం. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో ఎన్నడూ లేనంత చెత్త పనితీరు కనబరిచిన కాంగ్రెస్‌కు ప్రతిపక్ష నాయకుడిని నియమించేందుకు అవసరమైన సంఖ్యాబలం కూడా లేకపోయింది.

బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకున్న నేపథ్యంలో ప్రధాని మోదీ స్పందించారు. తమ కంచుకోటలో వరుసగా ఏడోసారి విజయం సాధించినందుకు పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీకి కార్యకర్తలే నిజమైన బలమని.. వారి అసాధారణమైన కృషి లేకుండా ఈ చారిత్రాత్మక విజయం సాధ్యం కాదంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పీఠాన్ని దక్కించుకుంది. 68 మంది సభ్యులు గల హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ కాంగ్రెస్ 40 స్థానాల్లో విజయం సాధించింది. 25 స్థానాల్లో బీజేపీ గెలిచింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. ముగ్గురు స్వతంత్రులు శాసనసభకు ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో హిమాచల్‌ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌ ఓటమిని అంగీకరించారు. గవర్నర్‌కు రాజీనామా లేఖను సమర్పించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామన్నారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. గత ఐదేళ్లలో తనకు సహకరించిన ప్రధాని మోడీకి, కేంద్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి పాటుపడతామని ఆయన స్పష్టం చేశారు.

Rivaba Jadeja: రివాబా జడేజా భారీ మెజార్టీతో ఘనవిజయం..

ఇదిలా ఉంటే విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు ముఖ్యమంత్రి అవుతారోనని ఆసక్తి నెలకొంది. ఈ పేర్లలో హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి,హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వీరభద్ర సింగ్ భార్య ప్రతిభాసింగ్ పేర్లు చక్కర్లు కొడుతోంది. సీఎం పదవిని అనేక మంది కాంగ్రెస్ పార్టీ నేతలు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం పార్టీ హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది. అయితే ముఖ్యంగా ఐదుగురి పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తోందని పార్టీ వర్గాలు తెలిపాయి. వారిలో ప్రతిభా సింగ్, సుఖ్వీందర్ సింగ్ సుఖు, ముఖేష్ అగ్నిహోత్రి, ఠాకూర్ కౌల్ సింగ్, ఆశా కుమారి ఉన్నారు. మరోవైపు గెలిచిన ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాంగ్రెస్​ జాగ్రత్తపడుతోంది. హిమాచల్‌ప్రదేశ్‌ ఇన్‌ఛార్జ్ రాజీవ్ శుక్లా, ఏఐసీసీ పరిశీలకులు, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్​ బఘేల్, సీనియర్ నేత భూపిందర్​ సింగ్ హుడాను సిమ్లాకు పంపించింది. పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను చండీగఢ్‌కు తరలించనున్నట్లు రాజీవ్ శుక్లా తెలిపారు. అక్కడే శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం రావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.