Odisha Swearing-In: ఒడిశాలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఇప్పటికే కొత్త ముఖ్యమంత్రి పేరు ఖారరైంది. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్ చరణ్ మాఝీని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. కేవీ సింగ్ దేవ్, ప్రవతి పారిదా ఉపముఖ్యమంత్రులుగా బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. జూన్ 12న బీజేపీ ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ఈ వేడుకలకు సంబంధించి పూరీలోని జగన్నాథుడికి బీజేపీ మొదటి ఆహ్వానాన్ని అందించింది. కొత్తగా ఎన్నికైన కొంతమంది ఎమ్మెల్యేలు పూరి జగన్నాథుడి ఆలయానికి వెళ్లి స్వామి వారికి తొలి ఆహ్వానాన్ని అందించారు.
మరోవైపు బీజేడీ చీఫ్, మాజీ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌కి కూడా ఆహ్వానం అందింది. బీజేపీ రాష్ట్ర చీఫ్ మన్మోహన్ సమాల్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల బృందం నవీన్ పట్నాయక్ ఇంటికి వెళ్లి రేపు సాయంత్రం 5 గంటలకు ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా అధికారికంగా ఆహ్వానించారు. ‘‘నవీన్ బాబు ఆహ్వానాన్ని అంగీకరించారు, అతను వేడుకలకు హాజరవుతానని హామీ ఇచ్చారు’’ అని మన్మోహన్ సమాల్ అన్నారు.
Read Also: Joe Biden: జునెటీన్త్ వేడుకల్లో ఆశ్చర్యపరిచిన బైడెన్ వ్యవహారశైలి.. వీడియో వైరల్
జగన్నాథుడి ఆలయానికి వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యేల్లో ప్రవతి పరిదా, పృథ్వీరాజ్ హరిచందన్, ఇరాశిష్ ఆచార్య మరియు అశ్రిత్ పట్నాయక్ ఉన్నారు. కొబ్బరికాయలు, తమలపాకులు, బియ్యం స్వామివారికి ఆలయానికి తీసుకెళ్లారు. అన్ని శుభకార్యాయాల్లో జగన్నాథుడిని ఆహ్వానించడం ఒడియా సంప్రదాయమని, అందుకే ఆయనను ఆహ్వానించేందుకు వచ్చామని పరిదా అన్నారు. ఈ వేడుకలకు ఒడిశా పీసీసీ చీఫ్, ఇతర రాజకీయ పార్టీల అధ్యక్షులను ఆహ్వానిస్తున్నట్లు బీజేపీ చీఫ్ చెప్పారు. ఇదే కాకుండా రాష్ట్ర కీర్తిని పెంచిన వ్యక్తులందర్ని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యే అవకాశం ఉంది.