తెలంగాణలో ఎన్నికలు హీటు పెంచుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే బీజేపీ పార్టీ నేడు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. సకల జనుల సౌభాగ్య తెలంగాణ పేరుతో బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విడుదల చేశారు. తెలంగాణను ప్రగతి పథంలో నడిపేందుకు దశ(పది) అంశాలతో కార్యచరణ రూపొందించారు.
1. ప్రజలందరికీ సుపరిపాలన.. సమర్థవంతమైన పాలనపై దృష్టి
- అవీనితిని ఉక్కుపాదంతో అణచివేయడంతోపాటుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆలోచనలకు అనుగుణంగా ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’ నినాదంతో సుపరిపాలన అందిస్తాం.
- ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నట్లుగానే పెట్రోల్, డీజిల్పై వ్యాట్ను తగ్గించడం ద్వారా పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గిస్తాం.
- ధరణి వ్యవస్థ స్థానంలో పారదర్శకమైన ‘మీభూమి’ వ్యవస్థను తీసుకొస్తాం.
- కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా అమలు చేయడం కోసం ప్రత్యేక నోడల్ మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేస్తాం.
- తెలంగాణ గల్ఫ్ నివాసితుల సంక్షేమం కోసం ప్రత్యేక నోడల్ విభాగాన్ని ఏర్పాటుచేస్తాం.
- ఉద్యోగస్తులు, పింఛనర్లకు ప్రతినెలా 1వ తేదీనే వేతనాలు ఇచ్చేలా చూస్తాం.
- బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో చేసిన కుంభకోణాలన్నింటిపై విచారణ కమిటీని ఏర్పాటుచేస్తాం. దోషులను న్యాయస్థానం ముందు నిలబెడతాం.
2. వెనుకబడిన వర్గాల సాధికారత – అందరికీ చట్టం సమానంగా వర్తింపు
- రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల ఆకాంక్షలను నెరవేరుస్తూ, అందరికీ సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధికి బాటలు వేస్తాం.
- బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిని చేస్తాం.
- రాజ్యాంగానికి విరుద్ధంగా.. మత ప్రతిపాదికన ఇచ్చిన రిజర్వేషన్లను తొలగించి వాటిని బీసీ, ఎస్సీలు, ఎస్టీలకు అందజేస్తాం.
- వివిధ చట్టాలను ఏకీకృతం, సమన్వయం చేసి ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదాను రూపొందించే కమిటీని ఏర్పాటుచేస్తాం.
- ఎస్సీల్లోని అత్యంత వెనుకబడిన వర్గాలకు సాధికారతను కల్పించేలా ఎస్సీ వర్గీకరణ చేయడంలో మావంతు సహకారాన్ని అందిస్తాం.
3. కూడు-గూడు: ఆహార, నివాస భద్రత
- రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కొత్త ఇళ్ల నిర్మాణం. తద్వారా అందరికీ ఇల్లు ఉండేలా చూస్తాం. ఇంటి పట్టాలు అందజేస్తాం
- అర్హత కలిగిన కుటుంబాలకు కొత్త రేషన్కార్డులు ఇస్తాం.
- సమయానుగుణంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా.. నాణ్యమైన రేష న్ను ప్రజలకు అందించే పారదర్శక వ్యవస్థను తీసుకొస్తాం.
- తద్వారా ఆహార ధాన్యాల అక్రమ రవాణాను నివారిస్తాం.
4. రైతే రాజు – అన్నదాతకు అందలం
- రాష్ట్రంలోని రైతుల ఎరువుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఎరువుల సబ్సిడీ (ఎకరానికి రూ.18వేలు)తోపాటుగా..
- చిన్న, సన్నకారు రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు రూ.2,500 ఇన్పుట్ అసిస్టెన్స్ అందిస్తాం.
- ప్రధానమంత్రి పంటబీమా పథకం ద్వారా రైతులకు ఉచిత పంటబీమాను అందిస్తాం.
- వరికి రూ.3100 మద్దతు ధరను కల్పిస్తాం.
- పసుపు కోసం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ను ఏర్పాటుచేస్తాం.
- ఆసక్తి గల రైతులకు దేశీ ఆవులను ఉచితంగా అందజేస్తాం.
- ప్రధానమంత్రి ప్రకటించిన జాతీయ పసుపుబోర్డు నిర్ణయానికి అనుగుణంగా నిజామాబాద్ టర్మరిక్ సిటీని డెవలప్ చేస్తాము.
5. నారీశక్తి- మహిళల నేతృత్వంలో అభివృద్ధి
- డిగ్రీకాలేజీలు, ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరే విద్యార్థినులకు ఉచిత ల్యాప్టాప్లు.
- ఆడబిడ్డ భరోసా (నవజాత బాలిక): ఆడబిడ్డ భరోసా పేరుతో.. నవజాత బాలికపై ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. ఆ బాలిక 21 ఏళ్లు వచ్చిన తర్వాత రూ.2లక్షలు పొందవచ్చు.
- ఉజ్వల లబ్ధిదారులకు ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తాం.
- స్వయం సహాయక బృందాలకు నామమాత్రపు 1% వడ్డీకే రుణాలు.
- మహిళా రైతులకు మద్దతు, సహకారం అందించేందుకు మహిళ రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం.
- దీని ద్వారా పంట ఉత్పత్తి అయిన దగ్గర్నుంచి వినియోగించేవరకు వారి ఉత్పత్తుల విలువను పెంచేందుకు సహకారం అందిస్తాం.
- ఇళ్లలో పనిచేసే మహిళలకు నైపుణ్య శిక్షణ, సామాజిక భద్రత అందించేందుకు డొమెస్టిక్ వర్కర్స్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తాం.
- మహిళలకు 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.
6. యువశక్తి- ఉపాధి
- యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) తరహాలో.. గ్రూప్-1, గ్రూప్-2 సహా.. TSPSC రిక్రూట్మెంట్ పరీక్షలను 6 నెలలకోసారి పారదర్శకంగా నిర్వహిస్తాం.
- EWS కోటాతో సహా అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను 6 నెలల్లో భర్తీ చేస్తాం.
- 7. విద్యాశ్రీ నాణ్యమైన విద్య.
- విద్యార్థులు, అధ్యాపకులకు మార్గదర్శకత్వం మండలంలో నోడల్ స్కూల్స్ ఏర్పాటు. కోసం ప్రతి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో మెరుగైన వసతుల కల్పన.
- అన్ని ప్రయివేటు పాఠశాలల్లో ఫీజుల విధానంపై పర్యవేక్షణ.
- బడ్జెట్ ప్రయివేట్ పాఠశాలలకు ఆస్తిపన్ను, విద్యుత్, నీటి బిల్లుల కమర్షియల్ బిల్లునుంచి మినహాయింపు.
8. వైద్యశ్రీ నాణ్యమైన వైద్యసంరక్షణ
- అర్హత కలిగిన కుటుంబాలకు.. ప్రయివేటు ఆసుపత్రుల్లోనూ ఏడాదికి రూ.10 లక్షల ఉచిత ఆరోగ్య కవరేజీ.
- జిల్లాస్థాయిలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకు ప్రోత్సాహం.
- ఆర్థికంగా వెనుకబాటుకు గురైన కుటుంబాలకు ఏడాదికోసారి ఉచిత వైద్య పరీక్షలు.
- కార్పొరేట్ ఆసుపత్రులు ఇష్టారీతిన వసూలు చేయకుండా పారదర్శక వ్యవస్థ.
- గుండెపోటు సంభవించినపుడు.. గోల్డెన్ అవర్ సమయంలో ప్రాణాలు రక్షించేందుకు వీలుగా.. పోలీసులు, హోంగార్డులు, కాలేజీ విద్యార్థులు, వాలంటీర్లకు కార్డియో పల్మనరీ రిససిటేషన్ (CPR) శిక్షణ.
9. సంపూర్ణ వికాసం – పరిశ్రమలు, మౌలికవసతులు & ఇతర సౌకర్యాలు
- తెలంగాణలో హైవేలు, ఇన్ఫోవేలు, రైల్వేలు, ఎయిర్వేల అభివృద్ధికి HIRA మోడల్ పై దృష్టి.
- ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పారిశ్రామిక కారిడార్ల పనులను వేగవంతం చేయడంతోపాటుగా కొత్తగా హైదరాబాద్-విజయవాడ పారిశ్రామిక కారిడార్ ప్రారంభానికి చొరవ.
- నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ.
- రైతులకు లబ్ధి చేకూర్చేలా.. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర సమీక్ష.
- కృష్ణానది జలాల్లో తెలంగాణ వాటా హక్కును పొందేందుకు KWDT-II ముందు రాష్ట్రం తరపు వాదనలు సమర్థవంతంగా వినిపిస్తాం.
- అసంపూర్తిగా ఉన్న కమాండ్ ఏరియా డెవలప్మెంట్ తో పాటుగా, కృష్ణానదిపై పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేయడం.
- కృష్ణానదిపై కొత్త ప్రాజెక్టులనిర్మాణం.
- సింగరేణి ఉద్యోగులకు ఆదాయపు పన్ను రీయింబర్స్మెంట్.
- గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న.. రవాణా, పారిశుధ్యం, ముంపు, రోడ్లు, ట్రాఫిక్ మేనేజ్మెంట్ తదితర సమస్యలకు పరిష్కారం, సమగ్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి.
10. వారసత్వం, సంస్కృతి & చరిత్ర
- సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహణ.
- హైదరాబాద్ సంస్థాన విముక్తి పోరాటంలో నాటితరం చేసిన పోరాటాలకు, త్యాగాలకు తగిన గుర్తింపు లభించేలా స్మారక చిహ్నం, మ్యూజియం నిర్మాణం.
- బైరాన్ పల్లి, పరకాల ఊచకోతను స్మరించుకుంటూ.. ఆగస్టు 27న ‘రజాకార్ల దుష్కృత్యాల సంస్మరణ దినం’గా నిర్వహణ.
- సమ్మక్క-సారమ్మ మేడారం జాతర జాతీయస్థాయిలో నిర్వహణ.
- వయోవృద్ధులకు ఉచితంగా అయోధ్య, కాశీ యాత్ర.
- ఉమ్మడి పౌరస్మృతికోసం కమిటీ ఏర్పాటు.