Site icon NTV Telugu

JP. Nadda: కాంగ్రెస్ స్కామ్‌ల పార్టీ.. బీఆర్ఎస్ ఏటీఎం పార్టీ

Nadda

Nadda

కాంగ్రెస్, బీఆర్ఎస్.. రెండూ కుటుంబ పార్టీలేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో బీజేపీ జన సభ జరిగింది. భువనగిరి పార్లమెంటు పరిధి నుంచి భారీగా బీజేపీ శ్రేణులు తరలివచ్చారు. భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నరసయ్యగౌడ్ తరపున జేపీ నడ్డా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై ధ్వజమెత్తారు. తెలంగాణకు బీఆర్ఎస్, కాంగ్రెస్ చేసింది శూన్యమని విమర్శించారు. ఈ రెండు పార్టీలు కుటుంబ పార్టీలేనన్నారు.

ఇది కూడా చదవండి: Throw Back: కడుపుతో ఉన్న నటిని 51 సార్లు కత్తితో పొడిచి, 16 ముక్కలుగా నరికి చంపారు!

కాంగ్రెస్ కుంభకోణాల పార్టీ.. కాళేశ్వరం బీఆర్ఎస్‌కు ఏటీఎంగా మారిందని విమర్శించారు. అవినీతి కేసులో కవిత జైలుకెళ్లారని పేర్కొన్నారు. రిజర్వేషన్లు పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించి.. మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీలను మోసం చేసి.. ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో కోత విధించేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని తెలిపారు. అయోధ్యలో రాముడికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు లేవని పార్లమెంట్‌లో చెప్పి మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. హిందుత్వానికి కాంగ్రెస్ పార్టీ విరోధి అని వ్యాఖ్యానించారు. టెర్రరిస్టులపై సర్జికల్ స్ట్రైక్‌లు చేస్తే కాంగ్రెస్ నేతలు ఆధారాలు చూపించాలని అడుగుతున్నారని చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Pushkar Singh Dhami: మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతుంది..

భారత రాజకీయాలను సమూలంగా మార్చివేసిన దార్శనికుడు ప్రధాని నరేంద్ర మోడీ అని తెలిపారు. దేశంలో జవాబు దారి రాజకీయాలకు మోడీ నాంది పలికారన్నారు. సంక్షేమ పథకాలు ప్రకటించడమే తప్ప.. అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదని జేపీ.నడ్డా ధ్వజమెత్తారు.

తెలంగాణలో నాల్గో విడతలో పోలింగ్ జరగనుంది. మే 13న తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు ఓటింగ్ జరగనుంది. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసింది. మంగళవారం మూడో విడత పోలింగ్ జరగనుంది. అనంతరం మే 13, 20, 25, జూన్ 1న ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.

Exit mobile version