Telangana Assembly Election 2023: ‘సమయం లేదు మిత్రమా రణమా శరణమా’ అని ఓ సినిమాలో డైలాగ్ ఉన్నట్టుగానే నిజంగా సమయం లేదు. విజయమో.. వీరపోరాటమో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది.. ప్రచారానికి నాలుగు రోజులే మిగిలి వుంది. 96 గంటలే గడువుంది. తర్వాత మైకులు బంద్. ప్రచారం సమాప్తం. అంతా గప్ చుప్. ఏం చేసినా ఈ నాలుగు రోజులే. ఎంత అరిచినా మంగళవారం వరకే. ఎన్ని హామిలిచ్చి ఓటర్లను ఆకట్టుకోవాలన్నా ఈ ఫోర్ డేసే. అందుకే దండు వేగం పెరిగింది. అగ్రదళం తరలివస్తోంది. అన్ని రాష్ట్రాల సమరం ముగియడంతో చిట్టచివరిగా తెలంగాణ వైపు పెను తుపాను దూసుకొస్తున్నట్టు టాప్ లీడర్లంతా హైదరాబాద్ లో ల్యాండవుతున్నారు. ఢిల్లీ నుంచి తెలంగాణ గల్లీగల్లీలో దండోరా మోగిస్తున్నారు. నాలుగు రోజులు పోరాడితే పోయోదేమీ లేదు.. వస్తే అధికారం.. లేదంటే పీఛేమూడ్ అన్నట్టుగా తుది సమరశంఖం పూరిస్తున్నారు. తెలంగాణను రణక్షేత్రంగా మార్చేస్తున్నారు. రానున్న మూడు, నాలుగు రోజులు తెలంగాణ పల్లెపల్లె, పట్టణం పట్టణం ఎన్నికల యుద్ధ భూమే.
తెలంగాణలో ప్రచారం వేడెక్కింది. పోలింగ్ కు మరో ఆరు రోజులు, ప్రచారానికి నాలుగు రోజులే ఉండటంతో క్యాంపెయిన్ స్పీడ్ ని పెంచాయి పార్టీలు. కాంగ్రెస్, బీజేపీ ఢిల్లీ నేతలు ఊరూరును చుట్టేస్తున్నారు. బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.. అగ్రనేతలంతా తెలంగాణలో మకాం వేసేలా వచ్చింది పరిస్థితి.. ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ చీప్ జేపీ నడ్డాతో పాటు.. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల మంత్రులు, నేతలు ఇలా రాష్ట్రంలో మోహరించారు. ఇక, బీఆర్ఎస్ ప్రచారం జెట్ స్పీడ్ తో సాగుతోంది. ఒకవైపు కేటీఆర్, హరీష్ రావులు నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ హీట్ పుట్టిస్తుంటే.. సీఎం కేసీఆర్ రోజుకు మూడు, నాలుగు సభల్లో పాల్గొంటూ విపక్షాలపై విరుచుకుపడుతున్నారు.
ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ గల్లీగల్లీని చుట్టేస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సహా రాష్ట్ర నాయకత్వం కాలికి బలపం కట్టుకుని నియోజకవర్గాలను తిరిగేస్తున్నారు. సభలు, సమావేశాలు, కార్నర్ మీటింగ్ లు హోరెత్తిస్తున్నారు. ఆరు గ్యారంటీలు జనాలకు గుర్తుండిపోయేలా ఇటు డైరెక్ట్ ప్రచారంలోనూ, అటు సోషల్ మీడియాలోనూ బజాయిస్తున్నారు. ఢిల్లీ నాయకత్వం కూడా రంగంలోకి దిగింది. కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ తెలంగాణ ప్రచార బరిలోకి దిగారు. వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాలు పర్యటించేలా ఆమె టూర్ ను ప్లాన్ చేశారు. ఇప్పటికే హుస్నాబాద్, పాలకుర్తి, కొత్తగూడెంలో క్యాంపెయిన్ నిర్వహించారు ప్రియాంక గాంధీ. సామాన్య ప్రజలతో మమేకం అవుతూ ప్రచారం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చెయ్యబోయే ఆరు గ్యారంటీలపై భరోసా కల్పించారు. ఒకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూనే, తాము పవర్ లోకి వస్తే ఏం చెయ్యబోతున్నామో జనాలకు వివరించారు ప్రియాంక గాంధీ. అధికారంలోకి వస్తే 2లక్షల రుణం మాఫీ చేస్తామన్నారు. కష్టపడి చదివినా ఉపాధి లేక యువత అన్నివిధాలా నష్టపోతోందన్న ప్రియాంక….తెలంగాణ యువత భవిష్యత్ పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిందన్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్సే కాదు బీజేపీ మరో రేంజ్ లో తెలంగాణను రౌండప్ చేస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, బండి సంజయ్ లు సెగ్మెంట్లను తిరిగేస్తున్నారు. కేంద్రమంత్రులు తెలంగాణలో ల్యాండయ్యారు. బీజేపీ పాలిత సీఎంలు రయ్యిమంటూ వచ్చేస్తున్నారు. ప్రధానమంత్రి ఇప్పటికే మెరుపు పర్యటనలతో రాజకీయ వేడిని రగిలిస్తే…రానున్న రోజుల్లో ఇక్కడే తిష్టవెయ్యబోతున్నారు. ఇక అమిత్ షా సైతం ప్రచార పర్వంలో దూసుకెళుతున్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మిజోరంలో అంతా సైలెంట్ కావడంతో, ఇక తెలంగాణపైనే దృష్టి కేంద్రీకరించారు అమిత్ షా. సామాజిక సమీకరణలతో సోషల్ ఇంజినీరింగ్ కు స్కెచ్ వేశారు. ప్రచారంలో అనేక అస్త్రాలను సంధిస్తున్నారు. ఆర్మూర్ సకల జనుల విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు అమిత్ షా. అలాగే శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, అంబర్‌పేట్‌లో రోడ్ షో నిర్వహించారు. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డును, బీడీ కార్మికుల కోసం ప్రత్యేక ఆస్పత్రిని నిర్మిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌పై ఘాటు విమర్శలు చేశారు. ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. దేశంలో అత్యంత అవినీతి చేసింది తెలంగాణలోని KCR సర్కారే అన్నారు అమిత్ షా. అవినీతికి పాల్పడినా ఏమీ జరగబోదని KCR, KTR అనుకుంటున్నారని తెలిపారాయన. తెలంగాణలో BJPకి అధికారాన్ని కట్టబెడితే… అవినీతిపరులను జైలుకు పంపుతామన్నారు అమిత్ షా.
సీఎం కేసీఆర్ ఏమాత్రం తగ్గడం లేదు. ప్రచారంలో కారు గేరు మార్చేశారు. శరవేగంగా సెగ్మెంట్లను చుట్టేస్తున్నారు. కనీసం మూడు నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామన్న కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. రైతు బంధు దుబారా చేస్తున్నారన్న వ్యాఖ్యలపైనా ఆయన ఫైర్ అయ్యారు. ప్రజలు ఓటు వేసే ముందు ఆలోచించాలని కోరారు కేసీఆర్. కామ్రేడ్లు సైతం తెలంగాణ దంగల్ లో కత్తి తిప్పుతున్నారు. కొత్తగూడెంలో కూనంనేని తరపున ఆ పార్టీ అగ్రనాయకులు ప్రచారం చేశారు. కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని నారాయణ విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఓడితేనే రాష్ట్రం, దేశం బాగుపడతాయన్నారు నారాయణ. ఇలా ప్రచారంలో తగ్గేదేలా అంటున్నారు ప్రధాన పార్టీల అగ్రనాయకులు. ఎడాపెడా నియోజకవర్గాలు తిరుగుతూ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. అయితే, ఇప్పటి వరకు ఒక లెక్క. ఇక నుంచి మరో లెక్క. రానున్న మూడు, నాలుగు రోజులు నెక్ట్స్ లెవల్లో క్యాంపెయిన్ ఉండబోతోంది. ఢిల్లీ నుంచి దేశంలోని గల్లీగల్లీ పార్టీల గణమంతా తెలంగాణ బాటపడుతున్నారు. ఊరూరా, ఇంటింటా ప్రచార పర్వాన్ని మార్మోగించబోతున్నారు.