Purandeswari: టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. చిత్తూరు జిల్లా కాణిపాకంలో పర్యటించిన ఆమె.. కాణిపాకంలోని వరసిద్ధి వినాయకున్ని దర్శించుకున్నారు.. ఆ తర్వాత కాణిపాకంలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో అసలు రోడ్లు, భవనాలు నిర్మాణమే జరగడం లేదని విమర్శించారు. ఈ ప్రభుత్వం కారణంగా 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల రోడ్డున పడ్డారన్న ఆమె.. నదుల్లో పెద్ద పెద్ద జేసీబీలతో ఇసుకను తవ్వేస్తున్నారు.. దాని వల్ల బోట్లు నడుపుతున్న వారికి ఉపాధి లేకుండా పోయిందన్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారు..? అని నిలదీశారు.
Read Also: Mayanmar Refugees: అధికారంలోకి ఎవరు వచ్చినా సరే.. కూడు, విద్య సమకూరిస్తే చాలు..
ఇక, చంద్రబాబును అక్రమ అరెస్టు చేశారని మొదట గళం విప్పింది బీజేపీయే అని గుర్తుచేశారు పురంధేశ్వరి.. మరోవైపు.. ఎన్నికల సమయంలో పొత్తులపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందన్నారు.. మేం లేవనెత్తిన ప్రశ్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పకుండా.. ఇతరుల మీద కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. మద్యం పై మేం లేవనెత్తిన ప్రశ్నలు సమాధానం చెప్పే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందని డిమాండ్ చేశారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. కాగా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల వల్లే ఏపీలో అభివృద్ధి జరుగుతుంది.. కానీ, కేంద్రం పేరు ఎందుకు చెప్పడం లేదంటూ పురంధేశ్వరి నిలదీస్తోన్న విషయం విదితమే. దీనిపై తిరుపతి నుంచి ఓ ప్రత్యేక కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టింది ఏపీ బీజేపీ.