శుక్రవారం ఢిల్లీ నుంచి పూణే వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టింది. దీని కారణంగా, ఈ విమానం తిరుగు ప్రయాణాన్ని ఎయిర్‌లైన్ రద్దు చేయాల్సి వచ్చింది. మార్గమధ్యలో పక్షి విమానాన్ని ఢీకొట్టిన విషయం పైలట్‌కు కూడా తెలియకపోవడం గమనార్హం. అయితే, పూణేలో ల్యాండింగ్ అయిన తర్వాత పక్షి ఢీ కొట్టినట్లు గుర్తించారు. దీంతో సంస్థ విమానం తిరుగు ప్రయాణాన్ని రద్దు చేశారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ బృందం క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తోందని ఎయిర్ ఇండియా తెలిపింది. “జూన్ 20న పూణే నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన AI-2470 విమానం పక్షి ఢీకొనడంతో రద్దు చేయబడింది. విమానం పూణేలో సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత పక్షి ఢీకొట్టినట్లు గుర్తించాం.” అని ఎయిర్ ఇండియా తెలిపింది.
READ MORE: Srinivas Goud: సీఎం సొంత జిల్లా అయిన మహబూబ్నగర్కు ఈ దుస్థితి ఏమిటి..?
రద్దయిన విమానానికి సంబంధించిన ప్రయాణీకులకు వసతి కల్పించడం సహా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎయిర్‌లైన్ తెలిపింది. ప్రయాణీకులకు టిక్కెట్లను రద్దు చేసుకునే లేదా తిరిగి బుక్ చేసుకునే అవకాశం ఉంటుందని ఎయిర్‌లైన్ స్పష్టం చేసింది. రద్దు చేసుకుంటే.. నగదు చెల్లిస్తామని వెల్లడించింది. ప్రయాణీకులను ఢిల్లీకి తీసుకెళ్లడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది.
READ MORE: CM Omar Abdullah: ఉద్యోగ నియామకాల రిజర్వేషన్ అంశంపై విపక్షాలపై సీఎం ఆగ్రహం..!
ఇటీవల అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం తర్వాత నుంచి దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియా తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఈ దుర్ఘటనను మరవకముందే సంస్థకు చెందిన పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు బయటపడటం కలవరపెడుతోంది. మరోవైపు, నిర్వహణ సమస్యలూ వెంటాడుతున్నాయి. దీని కారణంగా ఈ మధ్యకాలంలో పలు విమాన సర్వీసులు ఆలస్యమవుతున్నాయి. తాజాగా శుక్రవారం ఎనిమిది సర్వీసులను రద్దు చేసినట్లు ఎయిరిండియా ప్రకటించింది.