Bihar Elections 2025: దేశం దృష్టిని ఆకర్షించిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జన్ సురజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్‌కు ఇబ్బందులు మొదలయ్యాయి. పలు నివేదికల ప్రకారం.. పీకే పేరు బీహార్, పశ్చిమ బెంగాల్ రెండు రాష్ట్రాల ఓటర్ల జాబితాలలో కనిపిస్తుంది. దీంతో రెండు ఓటరు ఐడి కార్డులు కలిగి ఉన్న కారణంగా ఎన్నికల కమిషన్ ఆయనకు తాజాగా నోటీసు జారీ చేసింది. దీనిపై కమిషన్ మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని పీకేను కోరింది.
READ ALSO: Montha Cyclone: ఆ 5 గంటలే కీలకం.. తీరాన్ని సమీపించేకొద్దీ ఉగ్రరూపం దాలుస్తున్న ‘మొంథా’ తుఫాన్..!
రెండు ఓటర్ ఐడీ కార్డులు..
పలు నివేదికల ప్రకారం.. ససారాం రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ కిషోర్‌కు నోటీసు పంపారు. మూడు రోజుల్లోగా ఈ నోటీసుకు సమాధానం ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. పీకే ఓటరు ఐడీ నంబర్ IUJ1323718. ఇది కార్గహర్ అసెంబ్లీ నియోజకవర్గం జాబితాలో ఉంది. అలాగే ఆయనకు EPIC నంబర్ IUI 0686683 తో మరో ఓటరు ఐడీ కార్డు కూడా ఉందని పలు నివేదికలు పేర్కొన్నాయి. ఈ ఓటర్ నంబర్ కోల్‌కతా పరిధిలోని భవానీపూర్ అసెంబ్లీ ఓటరు జాబితాలో ఉంది.
రెండు ఓటరు ఐడీలను కలిగి ఉండటం చట్టపరమైన నేరం. 1950 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 17, 18 ప్రకారం.. ఏ వ్యక్తి కూడా ఒకటి కంటే ఎక్కువ ఓటరు ఐడీలను కలిగి ఉండకూడదు. అలాగే ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాలలో ఓటరు ఐడీ కార్డును కలిగి ఉండకూడదు. ఇది 1950 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 31 ప్రకారం శిక్షార్హమైన నేరం. వేర్వేరు ఓటరు జాబితాలలో ఓటరు ఐడీలు కనిపిస్తే, ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ అమలు చేయవచ్చు.
రెండు దశల్లో బీహార్ ఎన్నికలు..
బీహార్‌లోని మొత్తం 243 స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ జరుగుతుంది. మొదటి దశ నవంబర్ 6న 121 స్థానాలకు జరుగుతుంది. రెండవ దశ నవంబర్ 11న 122 స్థానాలకు జరుగుతుంది. ఫలితాలు నవంబర్ 14న ప్రకటించనున్నారు. తాజా ఘటన జన్ సురజ్ పార్టీకి పెద్ద దెబ్బగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
READ ALSO: 8th CPC Approval: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 8వ వేతన సంఘానికి కేబినెట్ ఆమోదం