NTV Telugu Site icon

GVMC Mayor Post: వైసీపీకి బిగ్ షాక్‌..! గ్రేటర్‌ విశాఖ పీఠంపై కూటమి గురి..

Gvmc

Gvmc

GVMC Mayor Post: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మరో బిగ్‌ షాక్‌ తగలబోతోంది.. రాష్ట్రంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పోరేషన్ గ్రేటర్ విశాఖను కైవసం చేసుకు నేందుకు కూటమి వేగంగా పావులు కదుపుతోంది. రాష్ట్రంలో అధికారం చేతులు మారిన వెంటనే మేయర్ హరి వెంకట కుమారికి పదవీ గండం తప్పదనే ప్రచారం విస్త్రతంగా జరిగింది. అయితే, సవరించిన మున్సిపల్ చట్టం ప్రకారం అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే కనీసం నాలుగేళ్ల గడువు పూర్తి కావాలి. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది.. ఆ గడువు మార్చి 18తో ముగుస్తుంది. దీంతో కూటమి పార్టీలు ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ ఇంప్లిమెంటేషన్‌లోకి తెచ్చేశాయి. ఇప్పటికే వైసీపీ చేతిలో ఉన్న పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను ఎన్డీఏ పక్షాలు కైవసం చేసుకున్నాయి. ఇప్పుడు విశాఖ మేయర్ పీఠం వంతు వచ్చింది. ఈ దిశగా చాలా తర్జనభర్జనలే జరిగాయి. సంఖ్యా బలం తక్కువగా వుండటం, బీసీ మహిళను అర్ధాంతరంగా పదవి నుంచి దించేస్తే ఎదురయ్యే నెగెటివ్ పబ్లిసిటీ వంటివి కూటమి పెద్దలు ఆలోచిస్తూ వచ్చారు. పైగా,ఏడాది కాలం కోసం అధికారం చేపడితే.. ఉన్న సమయం అంతా పట్టుసాధించడానికే సరిపోతుంది. ఈ లోపు ఎన్నికలను ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు అధికార పార్టీపై వుండే సాధారణ వ్యతిరేకత ఎదురైతే మొదటికే మోసం అనే కోణంలోనూ చర్చ జరిగింది.

Read Also: Annavaram Satyanarayana Temple: అన్నవరం సత్యదేవుని ఆలయంలో అపచారం..!

అయితే, నగరానికి చెందిన ఎమ్మెల్యేలు ఎట్టేకేలకు టీడీపీ అధినాయకత్వాన్ని ఒప్పించగలిగినట్టు తెలిసింది. సీనియర్ శాసనసభ్యులు వెలగపూడి రామక్రుష్ణ బాబు, గణబాబులకు టాస్క్ మేనేజర్ బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. దీంతో ఇప్పుడు అందరి దృష్టి మేయర్ హరివెంకట కుమారి అవిశ్వాస తీర్మానం ఎదుర్కోని నిలబడతారా…? లేక కూటమి వ్యూహం ముందు ఓటమిని ఎదుర్కొని పదవీచ్యుతురాలు అవుతారా…? అనేది ఉత్కంఠగా మారిపోయింది.. అయితే, మేయర్ పీఠం దక్కించుకోవడం ద్వారా వైసీపీ షాక్ ఇవ్వాలనే ఉత్సాహంతో ఉన్న కూటమి ఇప్పటికే లోపాయికారీగా ప్రతిపక్ష కార్పొరేటర్లను తమవైపు తిప్పు కోవడంలో సక్సెస్ అయిందనే ప్రచారం జరుగుతోంది. లెక్కలు, సమీకరణాలపై దృష్టి పెట్టిన నేతలు.. ఏక్షణానైనా అనే విధంగా సంకేతాలు పంపిస్తున్నారు. వాస్తవానికి 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీవీఎంసీ బడ్జెట్ సమావేశం నిర్వహించాల్సి ఉండగా ఇప్పటికే ఆలస్యం అయింది. అవిశ్వాసం పెట్టేందుకు నియమ నిబంధనలు వున్నాయి. దీంతో ఎమ్మెల్యేలు విస్త్రతమైన సంప్రదింపులు, సమావేశాలతో బిజిబిజీగా గడుపుతున్నారు. మేయర్ నాయకత్వంపై అభ్యంతరాలను తెలియజేస్తూ మెజారిటీ కార్పొరేటర్లు సంతకాలతో కూడిన నోటీసులు ఇవ్వాల్సి వుంటుంది. వాటిని పరిశీలించిన తర్వాత కలెక్టర్ కౌన్సిల్ సమావేశానికి నోటిఫికేషన్ ఇస్తారు. హరివెంకట కుమారి తన బలాన్ని నిరూపించుకోగలిగితే అవిశ్వాసం వీగిపోతుంది. లేదంటే కొత్త మేయర్ ఎన్నిక అనివార్యం అవుతుంది. దీంతో అటు కూటమి, ఇటూ వైఎస్సార్సీపీ వ్యూహాలు, ప్రతివ్యూహాలను గట్టిగా అమలు చేస్తున్నాయి.

Read Also: Ugadi 2025: రాబోయే ‘విశ్వావసు నామ’ సంవత్సరంలో మీ ఆదాయ, వ్యయాలు ఎలా ఉన్నాయంటే!

ప్రస్తుతం వున్న సమీకరణాల ప్రకారం నో కాన్ఫి డెన్స్ ఆపరేషన్ విజయవంతం కావాలంటే కూటమికి మరో 10మంది కార్పొరేటర్లు అవసరం కావొచ్చు. దీంతో ఎవరి బలం ఎంత అనే చర్చ రాజకీయ ఆసక్తిని పెంచేస్తోంది. 98 వార్డులు కలిగి వున్న గ్రేటర్ విశాఖలో 58మంది కార్పొరేటర్లతో తిరుగులేని విజయం నమోదు చేసింది ఫ్యాన్ పార్టీ. టీడీపీ 29, జనసేన 03, బీజేపీ ఒకరు.. వాపపక్షాలు చెరో ఒక కార్పొరేటర్‌ గెలుచుకున్నాయి. నలుగురు ఇండి పెండెంట్లు వున్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రేటర్ పాలిటిక్స్ ఊపందుకోగా… స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 12 మంది కార్పొరేటర్లు పార్టీ ఫిరాయించి జనసేన, టీడీపీలో చేరిపోయారు. దీంతో వైసీపీ 46కు పడిపోగా.. కూటమి బలం 49కి పెరిగింది. స్వతంత్రులతో కలిపినా లెక్క సరిపోదు. మేయర్ మీద అవిశ్వాసం పెట్టాలంటే కనీసం 64 మంది సభ్యుల మద్దతు అవసరం. దీంతో 10 మంది వైసీపీ కార్పొరేటర్లను ఆకర్షించడం ప్రధానంగా ఎమ్మెల్యేలు వర్కవుట్ చేస్తున్నట్టు బహిరంగానే ప్రచారం జరుగుతోంది. వివిధ వ్యాపారాల్లో వున్న కార్పొరేటర్లను పిలిచి మద్దతు ఇవ్వాలని సూచిస్తున్నట్టు సమాచారం. వైసీపీ కూడా అంత ఈజీగా కార్పొరేషన్ వదులుకునే పరిస్ధితిలో లేదు. ఇప్పటికే ఆ పార్టీ ముఖ్య నాయకత్వం కార్పొరేటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చింది. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు ప్రస్తుత ప్రభుత్వం మీద మార్పుకు సంకేతమని కంగారుపడి రాజకీయంగా తప్పటడుగులు వేయవద్దని సూచిస్తున్నట్టు తెలిసింది. దీంతో కూటమి వైపు వెళ్లేందుకు ఊగిసలాడుతున్న వాళ్లు సైతం తర్జనభర్జనలోనే వున్నారు. ఒక వేళ అనుకున్నది అనుకున్నట్టు జరగకపోయినా ఎక్స్ అఫీషియో ద్వారా అయినా మేయర్ పై అవిశ్వాసం నెగ్గేయాలనేది టీడీపీ ప్రయత్నం. దీంతో పొలిటికల్ సర్కిల్స్ లో ఉత్కంఠ పెరుగుతోంది.