Bhumana Karunakar Reddy: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌లపై తీవ్రంగా విరుచుకుపడ్డారు టీటీడీ ఛైర్మన్, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్జి. తిరుపతిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి దొంగలు పడ్డారంటూ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ నువ్వు ఏ సంవత్సరంలో పుట్టావో, అదే ఏడాది నుంచి తాను రాజకీయాలు ప్రారంభించానని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. పవన్ కళ్యాణ్ సంస్కార హీనుడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికైనా అన్యాయం జరిగింది అంటే మాకు ఓటు వేయొద్దని.. అభివృద్ది చూసి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చినందుకు ఓటు వేయాలని అడుగుతున్నామన్నారు.
45 ఏళ్ల కిందట రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు ఇప్పించినందుకు ఓటు వేయాలని.. కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు పెంచింనందుకు ఓటు వేయాలని అడుగుతున్నామన్నారు. తనపై వస్తున్న అవినీతి ఆరోపణలకు ఏ విచారణను ఎదుర్కొనేందుకైనా సిద్ధమని తాను సవాల్ విసురుతున్నానన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని.. పవన్ కళ్యాణ్ ప్రజా ద్రోహి అంటూ భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు.