Bhumana Karunakar Reddy: మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల పరకామణి కేసులో ఎవిఎస్వో సతీష్ కూమార్ ఆత్మహత్యపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సతీష్ కూమార్ మరణం వెనుక పెద్ద కుట్ర ఉందని, ఇది సాధారణ ఆత్మహత్య కాదని అది ప్రభుత్వ హత్య అని ఆరోపించారు. తిరుపతి విజివో, డీఎస్పీ రాంకుమార్ పలుమార్లు సతీష్ కూమార్ను తీవ్రంగా వేధించారని తెలిపారు. సిఐడి విచారణలో అధికారులు అతన్ని భూతులు తిట్టి, హింసించారని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. సతీష్ తన సన్నిహితులకు “సిఐడి విచారణ తర్వాత బతకడం కంటే చనిపోవడం మంచిదనే భావన కలిగింది” అని చెప్పాడన్న విషయాన్ని భూమన వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే ఆత్మహత్య వెనుక ఒత్తిడి, బెదిరింపులు స్పష్టంగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
అలాగే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సతీష్ కూమార్ను తన పేరు చెప్పించాలని పోలీసులు, సిఐడి అధికారులు పదేపదే ఒత్తిడి చేశారని అన్నారు. నా పై అధికారి నరసింహ కిషోర్ చెప్పినట్లు మాత్రమే చేశానని సతీష్ సిఐడికి చెప్పాడు. కానీ, రాజకీయ నాయకుల పేర్లు చెప్పించాలని ఒత్తిడి తెచ్చి సతీష్‌ను మానసికంగా చంపేశారని ఆరోపించారు. సిఐడి అధికారుల్లో లేని లక్షణరావు అనే న్యాయవాది కూడా విచారణలో పాల్గొని సతీష్‌ను భూతులు తిట్టి అవమానపరిచాడని భూమన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ తప్పనిసరిగా జరగాలని డిమాండ్ చేశారు. అలాగే “సీబీఐ విచారణ వేయగల ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా?” అని భూమన ప్రశ్నించారు. పోలీసుల మనోధైర్యాన్ని ప్రభుత్వం దెబ్బతీస్తోందని, ఒక మంచి ఉద్యోగి ప్రభుత్వ కుట్రల బలయ్యాడని తెలిపారు. పరకామణి కేసులో హైకోర్టు ఆదేశాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని భూమన తీవ్ర విమర్శలు గుప్పించారు.