Bhatti Vikramarka: సింగరేణి బొగ్గు గనుల వివాదం.. కేంద్ర ప్రకటనలపై డిప్యూటీ సీఎం ఫైర్

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka: సింగరేణి బొగ్గు గనుల కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. సింగరేణి కాలరీస్‌కు తాడిచెర్ల-2 బొగ్గు బ్లాక్‌ను తామే కొత్తగా కేటాయించామని, దానికి సంబంధించిన కొన్ని క్లియరెన్సులు ఇచ్చామని కేంద్ర పెద్దలు ప్రచారం చేసుకోవడంపై మండిపడ్డారు. వాస్తవాలను పూర్తిగా పక్కన పెట్టి, ప్రజలను తప్పుదోవ పట్టించేలా వేరేలా చిత్రీకరించడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని స్పష్టం చేశారు. తాడిచెర్ల-2 బ్లాక్‌ను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో 2013 లోనే సింగరేణి కాలరీస్‌కు అధికారికంగా కేటాయించిందని గుర్తుచేశారు. పైగా, గిరిజన ప్రాంతాలలో (ట్రైబల్ ఏరియా) ఉండే బొగ్గు గనులను నిబంధనల ప్రకారం కేవలం ప్రభుత్వ కంపెనీలకు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని, అలాంటప్పుడు ఇప్పుడు కొత్తగా మీరేదో అలాట్ చేసినట్లు చెప్పుకోవడం ఏంటని ప్రశ్నించారు.

తాడిచెర్ల-2 బ్లాక్‌కు సంబంధించిన అసలు చరిత్రను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియా ముందుంచారు. 2021 లోనే తాము మైనింగ్ లీజుకు సిద్ధమయ్యామని చెప్తూ సింగరేణి యాజమాన్యం కేంద్రానికి దరఖాస్తు చేసుకుందన్నారు. కానీ, ఆ మైనింగ్ లీజుకు అప్రూవల్ (ఆమోదం) ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం నాన్చుతూ ఇప్పటి వరకు ఫైళ్లను పెండింగ్‌లో పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కంపెనీకి లీజు ఇవ్వకుండా ఇలా ఆపడం సరికాదని తానే స్వయంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చామన్నారు. 2024 మార్చి లో అప్పటి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి, ఈ బ్లాక్‌కు సంబంధించిన పూర్వపరాలన్నింటినీ వివరించామని తెలిపారు. ఆ తర్వాత స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా వినతి పత్రం కూడా సమర్పించారని గుర్తుచేశారు. ఈ మైనింగ్ లీజు ఇవ్వకపోతే సింగరేణి సంస్థ తీవ్రంగా నష్టపోతుందనే వాస్తవాన్ని కేంద్రం ముందు ఉంచి, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో పోరాడి ఆ అనుమతులు తెచ్చుకుందని స్పష్టం చేశారు. అదంతా దాచేసి, ఎప్పుడో ఉన్నదానికే తామే కేటాయించామని కేంద్రం ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు.

కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ విధానాలను ఎండగడుతూ.. 2022 లో కోయగూడెంలోని బ్లాక్-3 ని కేంద్రం వేలం (ఆక్షన్) లో పెట్టి, నిబంధనలకు విరుద్ధంగా ఒక ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. అలా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిన ఆ బ్లాక్.. అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం ఓపెన్ కూడా కాలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి నిజంగానే సింగరేణి సంస్థకు మేలు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే.. చట్టప్రకారం కోయగూడెం బ్లాక్-3 తో పాటు సత్తుపల్లి బ్లాక్-3 గనులను కూడా తక్షణమే సింగరేణికే అప్పగించాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం సింగరేణిని కనీసం వేలంలో కూడా పాల్గొననీయకుండా నష్టం చేసిందని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్రం తన వైఖరి మార్చుకుని, గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉన్న కోల్ బ్లాకులను, అలాగే తెలంగాణలోని అన్ని బొగ్గు గనులను సింగరేణి సంస్థకే కేటాయించాలని కోరారు.